మూడు రోజుల పులివెందుల పర్యటనకు వైఎస్ జగన్..
#ఆంధ్రప్రదేశ్ #పులివెందుల #Jaganmohan Reddy #politics
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. జూన్ 23 సాయంత్రం పులివెందుల చేరుకోనున్న ఆయన, తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది.
జూన్ 24న వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆలయ అభివృద్ధికి కోటిన్నర రూపాయలకు పైగా నిధులు మంజూరు చేశారు. అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పాడా నిధులు, దాతల విరాళాలతో కలిపి సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో ఆలయ పునఃప్రతిష్ఠ పనులు చేపట్టారు.
దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం జగన్ తిరిగి క్యాంపు కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం నుంచి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యలపై చర్చించనున్నారు. జూన్ 25 ఉదయం ఆయన తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.