నెలలుగా పెండింగ్‌లో ఇసుక రీఫండ్‌లు.. టీజీఎండీసీపై కస్టమర్ల ఆగ్రహం

#Telangana #TGMDC #hyderabad

Jun 9, 2026 - 13:43
 0  11
నెలలుగా పెండింగ్‌లో ఇసుక రీఫండ్‌లు.. టీజీఎండీసీపై కస్టమర్ల ఆగ్రహం

తెలంగాణ మినరల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి అనేకమంది ఇసుక బుకింగ్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్‌లో పడిన బుకింగ్ మొత్తాల రీఫండ్ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నా ఫలితం శూన్యంగా మారుతోందని బాధితులు వాపోతున్నారు. ఇసుక అవసరాల కోసం టీజీఎండీసీ పోర్టల్‌లో బుకింగ్ చేసి, అది రద్దు అయినా లేదా పూర్తి కాకపోయినా, చెల్లించిన మొత్తం తిరిగి రావడం లేదని పలువురు కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రెండు నుండి మూడు నెలలుగా, మరికొందరు అంతకంటే ఎక్కువ కాలంగా రీఫండ్ కోసం వేచి ఉన్నారు. సమస్య పరిష్కరించుకోవాలని నేరుగా టీజీఎండీసీ కార్యాలయానికి వెళ్లిన కస్టమర్లను సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోబెట్టి, చివరకు సరైన సమాధానం ఇవ్వకుండా పంపిస్తున్నారని బాధితులు తెలిపారు. కనీసం "మీ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుంది" అని అడిగినా స్పష్టమైన జవాబు రాడం లేదని వారు అన్నారు.

"పొద్దున తొమ్మిది గంటలకు వెళ్తే సాయంత్రం అయిదు గంటలకు 'రేపు రండి' అంటున్నారు. ఇది ఎంత వరకు భరించాలి.. అంటూ బాధిత కస్టమర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేసినా, ఆఫీసుకు వెళ్లినా, ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని కస్టమర్లు చెప్తున్నారు. రీఫండ్ ఎందుకు జాప్యం అవుతోందో, ఎప్పటికి వస్తుందో అన్న విషయంలో కనీస పారదర్శకత కూడా లేదని వారు విమర్శిస్తున్నారు. ఇది సామాన్య కస్టమర్లను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెడుతోందని వారు వాపోయారు. ప్రభుత్వ సంస్థ అయిన టీజీఎండీసీ కస్టమర్ సేవలో ఈ స్థాయి నిర్లక్ష్యం అనుమతించదగినది కాదని నిపుణులు అంటున్నారు. డిజిటల్ బుకింగ్ వ్యవస్థ ద్వారా డబ్బు వసూలు చేసిన తర్వాత, రీఫండ్ ప్రక్రియలో కూడా అదే చురుకుదనం ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు.సంబంధిత అధికారులు ఈ సమస్యపై తక్షణ దృష్టి సారించి, పెండింగ్ రీఫండ్లన్నింటినీ నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. టీజీఎండీసీ జవాబుదారీతనాన్ని నిర్ధారించేందుకు సీనియర్ అధికారుల పర్యవేక్షణ, రీఫండ్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని కస్టమర్లు కోరుతున్నారు.