బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ
#Telangana #basara #basara temple #crime
నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ చోటుచేసుకుంది. ఉదయం అభిషేకం నిర్వహించేందుకు ఆలయానికి వెళ్లిన పూజారులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దొంగలు అమ్మవారికి అలంకరించే వెండి కిరీటాన్ని, హుండీని అపహరించినట్లు ప్రాథమికంగా తేలింది.
అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలోని మహాకాళి ఆలయ తాళాలను కూడా దొంగలు పగలగొట్టినట్లు గుర్తించారు. ఘటనతో ఆలయ సిబ్బంది, భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఆలయంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.