ఐపీఎల్ షురూ... బెట్టింగూ షురూ

Mar 29, 2026 - 10:40
 0  4
ఐపీఎల్ షురూ... బెట్టింగూ షురూ

ఐపీఎల్ మొదలైందంటే మనం టీవీల ముందు చేరతాం. ఆ టీమ్ ఈ టీమ్ అంటూ మన ఫేవరెట్ టీమ్ ఏదని మాట్లాడుకుంటాం. అందులో ఆడే ప్లేయర్ల గురించి తెలుసుకుంటాం. వాడు సక్సెస్ అవుతాడా వీడు సక్సెస్ అవుతుడా అని డిస్కస్ చేసుకుంటాం. కాని మరోవైపు ఐపీఎల్ మొదలవుతుందంటే బెట్టింగ్ దందా మొదలవుతుంది. బెట్టింగ్ అడ్డాలు ముందే సెట్ అవుతుంటాయి. చిన్న దాబాల నుంచి స్టార్ హోటల్స్ దాకా ఈ అడ్డాలు డెకరేట్ అవుతాయి. ఈ అడ్డాల్లో మందు, చికెన్ సప్లయ్ కి కూడా రంగం సిద్ధమైపోతుంది. గ్యాస్ ప్రాబ్లెమ్ ఉన్నా సరే.. ఇక్కడ మాత్రం ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు. అంతా సిద్ధమైపోతుంది. బెట్టింగ్ కి అవసరమైన డబ్బును అప్పు ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు రెడీ అవుతారు. పై స్థాయిలో మాఫియా రెడీ అయితే.. విలేజుల్లో ఈ వడ్డీ వ్యాపారులు రెడీ అవుతారు. ఢిల్లీ ముంబై హైదరాబాద్ ఒక రేంజులో అయితే... పల్లెటూర్లలో సైతం ఆయా రేంజుల్లో దందా రెడీ అవుతుంది.

మరి బెట్టింగ్ ఈ రేంజులో అవుతుంటే మన పోలీసులు ఏమీ చేయరా? అని డౌట్ రావొచ్చు. ఎందుకు చేయరు.. చేస్తారు. సజ్జనార్ లాంటి ఆఫీసర్లు ఏమో క్యాంపెయిన్ చేస్తారు బెట్టింగ్ ఆడకండి  అని. కింద మాత్రం కొందరు పోలీసులు ఈ బెట్టింగ్ అడ్డాల నుంచి కలెక్షన్ ఎంత రావాలో ప్లాన్ చేస్తుంటారు.  సిన్సియర్ ఆఫీసర్లు దాడులకు ప్లాన్ చేస్తుంటారు... పోలీసుల్లోనే ఉండే బెట్టింగ్ మాఫియా ఏజెంట్లు మాత్రం ఆ దాడుల సమాచారం ముందే ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంటారు. అరెస్టులు జరిగితే బెట్టింగ్ బంగార్రాజులను బయటకు తేవడానికి లాయర్లు కూడా సిద్ధంగా ఉంటారు.

ఇక స్టూడెంట్స్ నుంచి పెద్ద పెద్ద ఎంప్లాయిస్ వరకు ఈ బెట్టింగులో డబ్బు లు పెట్టడానికి రెడీ అవుతారు. డబ్బులు లేకపోతే అప్పులు ఇచ్చేవాళ్లు ఉంటారు. కొందరు లోన్ యాప్స్ లేదంటే ఊళ్లలో వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకుంటారు. ఎలా తిరిగి ఇవ్వాలనే ఆలోచన ఉండదు.. ఎందుకంటే అక్కడ వీళ్లకు డబల్ అమౌంట్ వచ్చేస్తుందని కలలు కంటుంటారు. వచ్చే డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి.. ఏం కొనుక్కోవాలి అనే కలల్లో తిరుగుతూ ఉంటారు. కాని డబ్బులు పోతే తిరిగి ఇవ్వలేకపోతే ఏంటి మన పరిస్ధితి అని ఆలోచించరు. బెట్టింగ్ కిక్కు ఆ రేంజులో ఉంటుంది మరి.

మరి ఈ బెట్టింగ్ ఆపలేమా? ఆపొచ్చు. మనం అనుకుంటే ఆపొచ్చు. బెట్టింగ్ ప్రమాదం అని గుర్తించినవాళ్లు.. ఆ బెట్టింగు మాయలో పడి చివరకు ఆత్మహత్యలు చేసుకునేవాళ్లను కాపాడటం కోసం... అప్రమత్తంగా ఉండి అలర్ట్ చేయాలి. ఎక్కడ ఏ బెట్టింగ్ జరుగుతున్నా వెంటనే సమాచారం పోలీసులకు పంపాలి. తర్వాత పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారో కూడా ఫాలోప్ చేయాలి.  ఏ ఊరుకా ఊరు బెట్టింగ్ నెట్ వర్క్‌కి కౌంటర్ నెట్ వర్క్ పెట్టుకుని ఆ బెట్టింగుని ఫెయిల్ చేయాలి.