పార్టీలో రేవంత్ వీక్ అవుతున్నారా?

#Telangana #Revanth reddy #politics #BRS #Congress

Aug 22, 2026 - 08:14
 0  16
పార్టీలో రేవంత్ వీక్ అవుతున్నారా?

ఒక నాయ‌కుడు ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉన్నంత కాలం.. ఎవ‌రూ ఏమీ అన‌లేరు.. ఏమీ చేయ‌లేరు. ప్ర‌తిప‌క్షాలు ఎటూ విమ‌ర్శ‌లు చేస్తాయి. కాని సొంత పార్టీ నాయ‌కులు విమ‌ర్శించ‌డానికి సాహ‌సించ‌రు. కాని ఎప్పుడైతే ఆ నాయ‌కుడు ప్ర‌జ‌ల్లో మ‌ద్ద‌తు కోల్పోతున్నాడ‌నే సంకేతాలు వ‌స్తాయో.. అప్పుడు సౌండ్ పెరుగుతుంది. ఎవ‌రైనా ఎదిరించి మాట్లాడటానికి వెనుకాడ‌రు. ఇక ఈ నాయ‌కుడు వెన‌క‌బ‌డ‌తాడు.. ప‌వ‌ర్ లో ఉండ‌డు అనే కాన్ఫిడెన్స్ వ‌స్తే చాలు రాజ‌కీయ దాడి పెరుగుతోంది. తెలంగాణ‌లో రేవంత్ రెడ్డిని చూసినా... ఆయ‌న‌ను నేరుగా విమ‌ర్శిస్తున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని చూసినా... మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత దూకుడు చూసినా అదే అర్ధ‌మవుతోంది.

సీఎం అయిన మొద‌ట్లో రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ మార్క్ స‌మ‌స్య‌లు ఎదురైనా ఓపిక‌గా ముందు హైక‌మాండ్ ను లైన్లో పెట్టే ప‌నిలో ప‌డ్డారు. కేబినెట్ విస్త‌ర‌ణ‌లోనూ, ఇత‌ర పార్టీల నేత‌ల‌ను తీసుకోవ‌డంలోనూ హైక‌మాండ్ ఆదేశాల‌కు త‌లొగ్గి వారి ఆదేశాల ప్ర‌కార‌మే న‌డుచుకున్నారు. అప్ప‌టి నుంచి హైక‌మాండ్ రేవంత్ కు ప్రాధాన్య‌త పెంచింది. మ‌రోవైపు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ను లైన్లో పెట్టుకున్నాడు. ఇక ఆ త‌ర్వాత దూకుడుగా ముందుకెళ్లారు. పోను పోను ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఉప ఎన్నిక‌లు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు గీటురాయిగా తీసుకోలేమ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లొచ్చేట‌ప్ప‌టికి ఇవ‌న్నీ మారిపోతాయంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో రియ‌ల్ ఎస్టేట్ దెబ్బ తిన‌డం మొద‌టి ఎఫెక్ట్. ఆ త‌ర్వాత ప‌థ‌కాల చెల్లింపుల్లో ఆల‌స్యాలు రెండో ఎఫెక్ట్. బీఆర్ఎస్ నేత‌ల‌పై కేసులు పెట్టినా విచార‌ణ‌లో రాజ‌కీయ వ్యూహాలు చూపించ‌డం బెడిసికొట్టింది. అయినా గాని ఒకరిని సింగ‌రేణి టెండ‌ర్ల విష‌యంలో, మ‌రొక‌రిని ఐఎఎస్ విష‌యంలో.. ఇంకొక‌రిని అవినీతి విష‌యంలో.. లేటెస్టుగా రెవ‌న్యూ స‌మ‌స్య‌ల వ్య‌వ‌హారంలోనూ చెక్ పెట్టిన‌ట్ల‌యింది. ఇవ‌న్నీ రేవంత్ రెడ్డికి క‌లిసొచ్చేవే.. ఆయ‌న‌కు పోటీ లేకుండా పోతుంది. ఈ మ‌ధ్య 2029కి కూడా నేనే సీఎంని అనే మాట ఎక్కువ‌గా వ‌చ్చింది అందుకేనేమో. కాని జ‌నంలో అలా లేదు.

ఒక‌ప్పుడు రేవంతే సీఎం అన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సినిమా వాళ్ల వ్య‌వ‌హారంలో విష‌యాలు న‌చ్చ‌క సైలెంట్ అయిపోయారు. సినిమా వాళ్ల‌కు టిక్కెట్ ధ‌రలు పెంచేది లేద‌ని ఆయ‌న అన్నారు. కాని అల్లు అర్జున్ వ్వ‌వ‌హారం, నాగార్జున ప్రాప‌ర్టీపై హైడ్రా దాడి త‌ర్వాత సినీ ఇండ‌స్ట్రీ అంతా రేవంత్ కంట్రోల్ లోకి వ‌చ్చింద‌నేది ప్ర‌చారం. త‌న శాఖ‌లో త‌న‌కు ప‌ట్టు లేకుండా చేయ‌టం.. త‌న జిల్లాలో పెత్త‌నం చేసిన పొంగులేటి విష‌యంలో డ‌బుల్ గేమ్ ఆడ‌టంతో.. వెంక‌ట‌రెడ్డి హ‌ర్ట్ అయ్యార‌ని అంటున్నారు. ఇక రాజ‌గోపాల్ రెడ్డి మొద‌టి నుంచే రెబెలే. కాని ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి హామీ రావ‌డంతో మ‌ద్ద‌తు ఇచ్చారు.  

కాని త‌ర్వాత తుంగతుర్తిలో తలెత్తిన వివాదంలో రేవంత్ బ్యాక్ డోర్ పాత్ర ఉంద‌ని తెలిసింద‌ని.. అందుకే మ‌ళ్లీ రాజ‌గోపాల్ రెడ్డి సీఎంపై డైరెక్ట్ అటాక్ మొద‌లెల్టార‌ని అంటున్నారు. బ‌య‌టి నుంచి వ‌చ్చిన‌వాళ్ల‌తో జాగ్ర‌త్త అంటూ ప‌రోక్షంగా రేవంత్ పై 

మాట‌ల దాడి చేశారు. 

ఇక కొండా సురేఖ్ వ్య‌వ‌హారం కొరుకుడు ప‌డ‌ని విధంగా ఉంద‌నుకుంటే.. ఆమె కూతురు ద్వారా కొండా ఫ్యామిలీ న‌డిపిస్తున్న రాజ‌కీయ డ్రామాతో రేవంత్ రెడ్డికి వారు ఎదురు తిరిగిన‌ట్లే అర్ధ‌మ‌వుతోంది. గ‌తంలో ఓఎస్ డీ విష‌యంలో సుస్మిత పోలీసుల‌నే ఎదిరించిన ఎపిసోడ్.. అప్పుడే చేసిన కామెంట్స్ తో వేడెక్కి న వ్య‌వ‌హారం త‌ర్వాత రాజీతో చ‌ల్లారింద‌ని అన్నారు. కాని ప‌ర‌కాల‌లో రేవూరి ప్ర‌కాష్ రెడ్డి మ‌ళ్లీ పోటీ చేస్తార‌ని రేవంత్ ప్ర‌క‌టించ‌డంతో.. దానికి సుస్మిత ఘాటు కౌంట‌ర్ ఇచ్చింది. ఆయ‌నెవ‌రు చెప్ప‌డానికి అని నేరుగా ప్ర‌శ్నించింది. అంతే వెంట‌నే పాత ఓఎస్డీ కేసు తెర‌పైకి వ‌చ్చేసింది. ఆ మాజీ ఓఎస్డీపై కేసు న‌మోదు అయిపోయింది. కొండా సురేఖ‌ను పీసీసీ వివ‌ర‌ణ అడిగితే.. కూతురు అన్న‌దానికి త‌న‌కు సంబందం లేద‌ని చెప్పింది. మ‌రోవైపు సుస్మిత మా అమ్మ‌, నాన్న మాట వినాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పింది. దీంతో కొండా కుటుంబం అన్నిటికీ సిద్ధ‌ప‌డింద‌ని అర్ధ‌మైపోతుంది.

ఇలా ఒక్కొక్క‌రు ఎదురు తిరుగుతున్నారు.. ప‌రిస్ధితి క‌లిసొస్తే రేవంత్ రెడ్డిని కింద‌కు లాగ‌టానికి రెడీగా చాలామంది కాంగ్రెస్ నాయ‌కులు ఎటూ ఉన్నారు. మ‌రి ప‌రిణామాలు ఎటు తిరుగుతాయో ఏం చేస్తారో చూడాలి మ‌రి.