'పాలిటిక్స్ ఆపి.. కాళేశ్వరం రన్నింగ్ లో పెట్టండి'
#తెలంగాణ #కాళేశ్వరం ప్రాజెక్టు #politics #kaleswaram
ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రణరంగం. పిల్లర్లు కుంగాయి. పంతాలు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ క్రెడిట్ అండ్ బ్లేమ్ గేమ్ నడుస్తోంది. బేసిక్స్ తెలియవు, బేసిన్లు తెలియవు అంటోంది గులాబీదళం. కాళేశ్వరం రీ-డిజైనే అతిపెద్ద కుట్ర అంటోంది హస్తం. నీళ్ల యుద్ధం రోజురోజు ముదురుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్ల మధ్య ప్రాజెక్టుల ఫైటింగ్ కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీలో కన్విన్స్ చేస్తే కేసీఆర్‌కే కాంట్రాక్టులు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాకు ఇరిగేషన్ మినిస్టర్ బాధ్యతలు అప్పగిస్తే మూడు నెలల్లోనే నీరందిస్తానంటూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు. నేతల సవాళ్ల లోగుట్టు ఏంటి..? పంతాలకు పోయి రైతులతో చెలగాటం ఆడుతున్నారా..? రాజకీయ రణంతో అన్నదాతలు ఆగమైపోతున్నారా..? అసలు కాళేశ్వరం కథేంటి..? ఎప్పుడెప్పుడు ఏం జరిగింది..? ఇప్పుడు ఏం జరుగుతోంది..? రేపటి కోసం ఏం జరగాలి..? నీళ్లతో రాజకీయం చేస్తుందెవరు..? తెరముందు కనిపించే నిజాలతో పాటు తెరవెనుక ఉన్న రహస్యాలేంటి..? పాయింట్ టు పాయింట్ కాళేశ్వరం పిక్చర్.
తలాపున పారుతోంది గోదారి. నీ చేను, నీ చెలక ఎడారి. తెలంగాణ జలగోసకు అద్దంపట్టిన పాట ఇది. బీడుబడ్డ పొలాలను చూసి రైతుల కన్నీళ్లతో తడిసిన నేలపై పాటల ఊట. ఒకప్పుడు చుట్టూ నదులు, ప్రాజెక్టులు ఉన్నా చుక్క నీరందని దుస్థితి. తెలంగాణ అంటేనే కరువు ముఖచిత్రం. నెర్రెలు బారిన నేలలు, వలసపోయిన బతుకులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక అన్నదాత బతుకుల్లో అలుముకున్న అమావాస్య తొలగిపోయింది. ఒకే ఒక్క ప్రాజెక్టుతో యావత్ ప్రపంచమే అబ్బురపడింది. అదే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. రాష్ట్ర సాగునీటి రంగాన్నే కాదు..! రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే ప్రయత్నం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూపాంతరమే కాళేశ్వరం ప్రాజెక్టు. 2007లో 12 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో 17 వేల 875 కోట్ల అంచనాతో ప్రాణహిత చేవెళ్ల ప్రారంభమైంది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే 38 వేల కోట్లకు పెంచింది. కానీ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రాజెక్టులపై దృష్టిసారించారు.ఇంతింతై వటుడింతై అన్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్ల మార్క్‌కు చేరుకుంది.
తెలంగాణలో గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ, ఎత్తైన భౌగోళిక స్వరూపం కారణంగా ఆ నీటిని సాగుకు వినియోగించడం కష్టంగా మారింది. అందుకే గోదావరి నీళ్లను అనేక దశల్లో పైప్రాంతాలకు ఎత్తిపోసి సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు కేసీఆర్. గోదావరి, ప్రాణహిత నదుల సంగమ క్షేత్రమైన కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద నీటిని మళ్లించేలా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడం, మరో 18.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల తాగునీటి, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చడమే ప్రాజెక్టు ప్రధానోద్దేశం. తెలంగాణ జల వ్యూహానికి మకుటాయమానం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. లక్ష కోట్ల ప్రజాధనం పోసి నిర్మించిన KLIP నేతల పంతాలకు, పట్టింపులకు వేదికైంది. రాజకీయ రణగర్జనకు రంగస్థలంగా మారింది. 2016 మే 2న మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మూడేండ్లలోనే 2019 జూన్ 21న తన కలలప్రాజెక్టును ప్రారంభించారు. ఆల్ ఈజ్ వెల్ అనుకునే లోపు 2022 జూలైలో వచ్చిన భారీ వరదలకు కన్నెపల్లి పంప్‌హౌస్ నీట మునిగిపోయింది. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు గులాబీదళంలో మరింత గుబులు పుట్టింది. 7వ బ్లాక్‌లో పిల్లర్లు కుంగిపోయి, రాఫ్ట్‌లు పగిలిపోయాయి. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రచార అస్త్రంగా ఆయుధం దొరికింది. అప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కాళేశ్వర యుద్ధంకొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలు గుర్తించి విజిలెన్స్ విచారణకు, జ్యుడీషియల్ కమిషన్ ఎంక్వైరీకి ఆదేశించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రంగంలోకి దిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద అవినీతి కుంభకోణమని, సరైన ప్రణాళిక, డిజైన్లు లేకుండా కట్టడం వల్లే బ్యారేజీలు కుంగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ హయాంలో జరిగిన తప్పులను ప్రజల్లో ఉంచి, రాజకీయంగా బీఆర్ఎస్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుంది. లక్షలాది ఎకరాలకు నీరందించిన ప్రాజెక్టులో చిన్న సాంకేతిక లోపాన్ని పూడ్చాల్సింది పోయి రాజకీయ బురద చల్లడానికే రేవంత్ సర్కార్ వాడుకుంటోందని గులాబీదళం విమర్శిస్తోంది.
నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్ అందులో భాగమే. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. కాళేశ్వరంతో తెలంగాణకు జలాభిషేకం చేశారు కేసీఆర్. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ప్రాణప్రతిష్ట చేశారు. సముద్ర మట్టానికి వందల మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల వరకు గోదావరి జలాలను తరలించేలా రూపొందించారు. ఎడారిగా మారుతున్న తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ప్రారంభమైన KLIP నేడు సాంకేతిక లోపాలు, అవినీతి ఆరోపణలు, పాలకుల వైఫల్యాల వలయంలో చిక్కుకుని చర్చనీయాంశంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లు ఎందుకు తెరవడం లేదు..? మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఎందుకుఎత్తిపోయడం లేదు..? బ్యారేజీ మరమ్మతు ఎందుకు చేయడం లేదనే ప్రశ్నలు తెలంగాణ సమాజం నుంచి వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. అనేక సాంకేతిక కారణాలు ఉన్నాయి.గేట్లు తెరిచే ఉంచాలి. కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పునాదులు దెబ్బతిన్నాయి. బ్యారేజీల్లో నీటిని నిల్వ ఉంచితే ఒత్తిడికి పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే వచ్చిన నీటిని వచ్చినట్లు గేట్లు ఎత్తి కిందకు వదిలేయాలి.అయితే బ్యారేజీల్లో నీరు లేకపోతే పంపింగ్ సాధ్యం కాదు. బ్యారేజీల్లో నీటి నిల్వ లేదు కాబట్టి, పంప్‌హౌస్‌లు నడిపించే అవకాశం లేదంటోంది నీటిపారుదలశాఖ విభాగం. ఎల్‌నినో ప్రభావంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే లక్ష్యంగా నీళ్లతో నిప్పు రాజేస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌ను మరోసారి సంధిస్తోంది. 2023 ఎన్నికల్లో ఓటమికి కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టును... 2028 ఎన్నికల విజయం కోసం ఉపయోగించుకునేందుకు బీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది.
తప్పు ఎవరిదైనా నష్టపోతోంది మాత్రం తెలంగాణ రైతులే. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలు, అవినీతి జరిగాయనేది వాస్తవం.వేల కోట్లు ఖర్చుచేసి నిర్మించిన ప్రాజెక్ట్ మూడేండ్లకే కుంగడం ముమ్మాటికీ నిర్లక్ష్యమే. అయితే గత పాలకుల తప్పులను సరిదిద్దాల్సిన రేవంత్ ప్రభుత్వం కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించకపోతే పంటలకు నీరందక ఆయకట్టు ఎండిపోయే ప్రమాదం ఉంది. శాశ్వత మరమ్మతులు చేపట్టి, లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత పాలకులదే. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, సాంకేతిక నిపుణుల సలహాలతో ముందడుగు వేస్తేనే కాళేశ్వరం మళ్లీ తెలంగాణ పాలిట కల్పవల్లిగా మారనుంది.