సాయికృష్ణ ఎక్కడున్నాడు?

Jun 13, 2026 - 14:06
Jun 13, 2026 - 14:09
 0  105
సాయికృష్ణ ఎక్కడున్నాడు?

కుమార్ చంద్ పుల్లగూర

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఏ మలుపు తిరుగబోతోందా అని ప్రతిఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పోలీసులే అరెస్ట్ చేసారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తోంటే.. తమకేం తెలియదంటూ.. పోలీసులు చెబుతున్నారు. ఎన్నో ఆరోపణల మధ్య 6వ టౌన్ సిఐ నాగరాజు ఉన్నప్పటికీ.. హైకోర్టు గాదె సాయికృష్ణ ఆచూకీ కనుక్కోవాలని ఆదేశించినప్పటికీ.. నిమ్మకునీరెత్తినట్లు ఆయన వ్యవహరించటం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గాదె సాయికృష్ణ మిస్సింగ్ విషయమై.. హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ కు ఇంకా కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉన్నప్పటికీ.. ఇంకా సెర్చింగ్లోనే ఉన్నాం అంటూ సిఐ చెబుతున్నారు. ఇక కేసు పూర్వపరాలను ఓసారి పరిశీలిస్తే.. విజయవాడకి చెందిన పాత నేరస్తుడు గాదె సాయి కృష్ణా మిస్సింగ్ వ్యవహారం గత కొన్నిరోజులుగా కలకలం రేపుతోంది. హైకోర్టులో సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పై విచారణ జరిపిన జస్టిస్ హరిహరనాధ శర్మ, జస్టిస్ సురేష్ రెడ్డిల ధర్మాసనం ఈ నెల 15లోపు సాయికృష్ణ ఆచూకీ కనిపెట్టాలని ఏపీ పోలీసుల్ని ఆదేశించింది.

విజయవాడ కృష్ణలంకకి చెందిన గాదె సాయికృష్ణ మీద 22కేసులు ఉన్నాయి. 2012లో బాల నేరస్తుడిగా విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ రికార్డుల్లోకి తొలిసారి సాయికృష్ణ ఎక్కాడు. 2015 లో సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసులో అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత వరుసగా కేసుల్లో ఇరుక్కుంటూ చివరకి రౌడీ షీటర్ గా పోలీసులు షీట్ ను ఓపెన్ చేశారు. 

గొడవలు, అల్లర్లు, చోరీలు, గంజాయి కేసు, పోక్సో కేసు, హత్య కేసు సహా పలు నేరాల్లో పాల్గొన్నాడనే ఆరోపణలు పోలీసుల నుంచీ ఉన్నాయి. ప్రస్తుతం నాలుగు కేసులు దర్యాప్తులో ఉన్నాయని, మరో నాలుగు కోర్టు విచారణలో ఉన్నాయని తెలుస్తోంది.

2025 నుంచి కోర్టు కేసుల విచారణకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. గత ఏడాది జగ్గయ్యపేట మకాం మార్చాడట సాయికృష్ణ. అక్కడ రూమ్మేట్ తో తలెత్తిన వివాదంలో అతడిని హత్య చేసి జైలుకు వెళ్ళాడని పోలీసులు చెబుతున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చాక మార్కాపురంకు సాయికృష్ణ షిఫ్ట్ అయ్యాడట. 

ఈ క్రమంలో మే 6,7 తేదీల్లో

మార్కాపురంలో ఉంటున్న సాయి కృష్ణను ఇద్దరు కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కోర్టు లో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. సాయి కృష్ణా ఆచూకీ తెలియక పోవడంతో అతని తల్లి గత నెలలో విజయవాడ బార్ అసోసియేషన్ ను ఆశ్రయించింది. BBA విచారణలో మార్కాపురంలో సాయి కృష్ణను అదుపులోకి తీసుకోవడం నిజమే అని రూడీ కావడంతో వారి సాయంతో హై కోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ క్రమంలో ఇటీవల హై కోర్టులో జరిగిన విచారణలో సాయి కృష్ణా ఆచూకీ కనిపెట్టాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. నిందితుడు తమ అదుపులో లేడని పీపీ చెప్పడంతో ఈ నెల 15న అతడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరచాలని హై కోర్టు ఆదేశించింది. ఇక కృష్ణలంక పోలీసులు సాయికృష్ణ ను హై కోర్టులో హాజరుపరుస్తారో లేదో వేచిచూడాలి.

మరోవైపు సాయికృష్ణ తమ అదుపులో లేడని విజయవాడ పోలీసులు చెబుతున్నారు. స్వయంగా సిఐ నాగరాజును వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ.. ``మాకేమి సంబంధం లేదు, అస్సలు అతన్ని అరెస్ట్ చేయలేదు. సాయికృష్ణపై వారెంట్స్ ఉన్నాయి. అతని కోసం గాలిస్తున్నాం.సాయికృష్ణపై గంజాయి, మర్డర్, ఇతర కేసులున్నాయి. అతనిపై వ్యక్తిగత కక్ష్య మాకు లేదు- నాగరాజు, సిఐ, కృష్ణలంక.

సాయికృష్ణ బతికి లేడనే అనుమానాలు మాకు ఉన్నాయి. ఇందుకు కారణాలుగా పలు ఆధారాలు మా వద్ద ఉన్నాయి. గత నెల అంటే మే 30 వ తేదీనే మా కుమారుడు సాయికృష్ణ ను పోలీసులు మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక కుమారుని ఆచూకీ అడిగితే.. సిఐ నాగరాజు దుర్భాషలాడాడు. -గాదె సాయికృష్ణ తల్లి.

గాదె సాయికృష్ణ ఆచూకీ అడిగితే.. కృష్ణలంక సిఐ నాగరాజు ఇష్టానుసారం మాట్లాడారు. అడ్వొకేట్స్ తో మాట్లాడుతున్నారన్న సెన్స్ కూడా ఆయన మరచిపోయారు. ఎంతలా అంటే విచక్షణారహితంగా ప్రవర్తించారు. వివరణ అడిగిన క్రమంలో సిఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మాకు పలు అనుమానాలు రేకెత్తాయి. దీంతో హైకోర్టును ఆశ్రయించాం. వెంటనే హైకోర్టు ధర్మాసనం హెబియస్ కార్పస్ పై విచారణ జరిపి ఈ నెల 15న సాయికృష్ణను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. అయితే సాయికృష్ణ ను పోలీసులే ఎదో చేశారు.- ముళ్ళపూడి కనకదుర్గ, అడ్వొకేట్, హైకోర్టు.

ఇప్పటికే సాయికృష్ణ కేసును వాదిస్తున్న న్యాయవాది ముళ్ళపూడి కనకదుర్గకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెబుతున్నారు. ఆమె కదలికలపై నిఘా పెట్టేందుకు పోలీసులు షీ టీమ్స్ ను వాడుకుంటున్నారు. మరోవైపు కేసును వెనక్కి తీసుకోవాలంటూ రాజీ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాగే సాయికృష్ణ కుటుంబానికి బాసటగా మేము, మా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది.- కొలనుకొండ శివాజీ, కాంగ్రెస్ నాయకులు.