టౌన్ ప్లానింగ్ పయనం ఎటో..?

Jun 7, 2026 - 11:54
 0  94
టౌన్ ప్లానింగ్ పయనం ఎటో..?

కుమార్ చంద్ పుల్లగుర

విజయవాడ నగర పాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై రోజురోజుకీ విమర్శలు పెరుగుతూ ఉన్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్లో కొందరు నిబంధనల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ప్రస్తుతం తీవ్రంగా వస్తున్నాయి. ఈ అవినీతి భాగోతమంతా తెలిసి కూడా ఛీఫ్ ప్లానర్ లాంటి స్థాయి వ్యక్తే ఈ అవకతవకలు కట్టడి చెయ్యటం లేదంటే.. ఏ స్థాయిలో ముడుపులు చేతులు మారుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక అస్సలు నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఏదైనా అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ కొనాలనుకొంటే దానికి సంబంధించిన రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోండని ప్రభుత్వం చెబుతోంది. అలాగే బిల్డర్లు లైసెన్స్ ఉన్నవారా కాదా? అనేది కూడా చూసుకోవాలని సూచిస్తోంది. ఎందుకంటే లైసెన్స్ ఉన్న బిల్డర్ అయితే అపార్ట్‌మెంట్ నాణ్యత బాగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.


లైసెన్సు లేకుండా అపార్ట్‌మెంట్ నిర్మాణాలకు అనుమతి లేదని, అందుకే డాక్యుమెంట్లు సరిచూసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. లైసెన్సు లేకుండా అపార్ట్‌మెంట్ నిర్మిస్తే మున్సిపల్ కార్పొరేషన్‌కు తెలియజేయాలని అంటోంది. కానీ అలాంటి బిల్డర్లకు లైసెన్సుల మంజూరులోనే నిబంధనలు పాటించడం లేదని, మున్సిపల్ అధికారులే చట్ట విరుద్ధంగా అనుమతులు జారీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే విషయమై 3 నెలల క్రితమే టౌన్ ప్లానింగ్ లో అవినీతి జరిగిందంటూ ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. పట్టుమని 3 నెలలు కూడా కాకుండానే మళ్ళీ నిబంధనలకు వ్యతిరేకంగా కట్టడాలు, నిర్మాణాలు చేస్తున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారులు నోరు మెదపకుండా కూర్చుంటున్నారు.  ఇక మనం ఒకసారి గతాన్ని కూడా పరిశీలిస్తే.. 2022లో నిబంధనలను ఉల్లంఘించి బిల్డర్ లైసెన్సులు మంజూరు చేశారంటూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దానిపై వరుస కథనాలు అప్పట్లో మీడియాలో చాలా వచ్చాయి. అయితే, విషయం ఏంటంటే.. ఇప్పటికీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలో ప్రణాళికా విభాగం తీరు మీద విమర్శలు వస్తున్నాయి. వాటికి తోడుగా లైసెన్సుల మంజూరులోనే ఇలా వ్యవహరిస్తే ఇక అలాంటి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు కొన్న వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.


పట్టణాలు, నగరాల పరిధిలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం బిల్డర్లకు లైసెన్సుల మంజూరు చేసే అధికారం కమిషనర్లకు ఉంటుంది. జీవో నెం.119 ప్రకారం నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్లో కొందరు నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించే నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇందుకు కారణం టౌన్ ప్లానింగ్ అధికారులు, ఉన్నతాధికారుల జేబులు నింపేందుకేనని తెలుస్తుంది. అంతేకాకుండా.. సదరు ఉన్నతాధికారులు తమ బాస్ ల జేబులు నింపేందుకే ఈ పాట్లు పడుతున్నారని తెలుస్తోంది. ఇక మన విఎంసి ఛీఫ్ ప్లానెర్ గారు.. ఆయన ఛాంబర్ ఎదుట గంటల తరబడి ఎదురు చూపులు చూసినా పట్టించుకోరు. పైగా ఆయన కింద పనిచేసే సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తులను ఆయన ఛాంబర్ కి పిలిచి ఇష్టానుసారం తిట్టి ``బయటకు పోవయ్యా.. బయటకు దొబ్బు'' అంటూ గట్టిగా అరిచి వారిని బెదిరించేస్తారు మన సారు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ముడుపులు సరిగ్గా పైన అందించలేనేమో అనే భయమే ఆయనను అలా ప్రవర్తించేలా చేస్తోందని టౌన్ ప్లానింగ్ లో ఉన్న ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. అమ్మ పుట్టినిల్లు మేనమామకు ఎరుకే కదా అన్న చందంలా ఉంది టౌన్ ప్లాన్ అధికారులు, ఉన్నతాధికారుల మధ్య వార్. ఒకరి అవినీతి మరొకరికి తెలియడంతో వారిలో వారే కుమ్ములాడుకుంటున్నారు. 

ఏదిఏమైనా,, విజయవాడ పరిసరాల్లో ముఖ్యంగా కార్పొరేషన్‌తో పాటుగా సీఆర్డీఏ పరిధిలో 2015 తర్వాత నిర్మాణాలు పెరిగాయి. వాటికి అనుమతులు కోరుతూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇలా వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించడం, నిబంధనలను అనుసరించి లైసెన్సులు మంజూరు చేయడం లాంటి విషయాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది కొనుగోలుదారులకు సమస్యగా మారుతోందని తెలుస్తోంది. 

మరొక కథనంలో టౌన్ ప్లానింగ్ విభాగంకు సంబంధించిన మరిన్ని వివరాలు మీ ముందుకు పాయింట్ మీడియా త్వరలో తీసుకువస్తుంది.