ఈఓ గారు, మీకు ఇది తగునా?
#andhrapradesh #kanakadurgammatemple ##EO #vijayawada
కుమార్ చంద్ పుల్లగూర
విజయవాడ కనకదుర్గగుడి ఈవో శీనానాయక్ నేరుగా తన అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసారు. భవానీ దీక్షల సమయంలో కనకదుర్గమ్మ గుడికి తరలివచ్చే భక్తులకు వియంసి కొంతమంది వెండర్స్ ద్వారా ఖర్చు చేసిన నిధులను విడుదల చేయకుండా జాప్యం చేస్తూ.. మరోమారు తన వైఫల్యాన్ని ప్రదర్శించారు. ఆఖరుకి జిల్లాకు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అయిన జిల్లా కలెక్టర్ చెప్పినా.. వినని స్థితికి ఆయన చేరుకున్నారంటే ఆయనలోని నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరుకుందో తేటతెల్లమవుతోంది. వివరాల్లోనికి వెళితే.. గతేడాది అక్టోబర్‌లో జరిగిన భవానీ దీక్షల సమయంలో లక్షలాది మంది కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే భవానీ దీక్షల సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకూడదన్న సదుద్దేశ్యంతో అటు హోంమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, వియంసి కమీషనర్ ధ్యానచంద్ర, తదితరులు హాజరయ్యారు. ఈ భవానీదీక్షల నేపధ్యంలో తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా.. పాలు, బిస్కెట్లను పంపిణీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు హోంమంత్రి. మంత్రి ఆదేశాలనుసారం వియంసి కొంతమంది వెండర్లకు పాలు, బిస్కెట్లను పంపిణీ చేయాల్సిందిగా ఆదేశించింది. వెంటనే పాలు, బిస్కెట్లను పంపిణీ చేశాయి ఆయా వెండర్ సంస్థలు.. మొత్తం 24 లక్షల రూపాయల బిల్లును వియంసికి పంపించాయి.
ఆ బిల్లును పాస్ చేయాల్సిందిగా దుర్గగుడి ఈవో శీనానాయక్ ను కోరగా..ఆయన దానిని పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత వెండర్లు గొడవ చేయటంతో.. ఏప్రిల్ 29న వియంసి కమీషనర్ సంబంధిత నిధులను విడుదల చేయాల్సిందిగా కోరుతూ ఓ లేఖను ఈవోకు రాశారు. అయినా లాభం లేకుండా పోయింది. ఈ విషయం అప్పటికే తెలుసుకున్న కలెక్టర్ లక్ష్మీశా కూడా సదరు వెండర్లకు క్లియరెన్స్ చేయాలని సూచించారు కూడా.. కలెక్టరే చెప్పారని సదరు కనకదుర్గ గుడిలో ఉన్న సంబంధిత డిపార్టుమెంట్లలో చెప్పగా.. కలెక్టరు చెబితే చెయ్యాలా.. వర్క్ ఆర్డర్ లేకుండా మేము ఎలా చేస్తాము అంటూ సిబ్బంది అనటం విస్మయం కలిగించిందనే చెప్పాలి. అదేవిధంగా ఈ నిధులను ఎలా విడుదల చేస్తారని అడుగగా.. ఈవో శీనానాయక్ బిల్లులను ఓకే చేయాలని, ఆ తర్వాతే ఆ బిల్లులు ఆడిట్ కు వెళ్ళిన అనంతరం అకౌంట్స్ డిపార్టుమెంట్ కు వెళ్ళాక నిధులు విడుదల అవుతాయని చెప్పుకొచ్చారు. అయితే ఇంత తంతూ జరుగుతున్నా.. తనకేమీ పట్టనట్టు ఈవో శీనానాయక్ మాత్రం వాటిని గాలికొదిలేసారు.
ప్రస్తుతం ఈ బిల్లులు పాస్ కాకపోవటంపై అసహనం ప్రదర్శిస్తున్న వెండర్లు సంబంధిత వర్కును అప్పచెప్పిన వియంసి ఉద్యోగిపై మండిపడుతున్నారు. ఆయనపై కేసును పెడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పాయింట్ మీడియా కలెక్టర్ లక్ష్మీశా దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసింది. ఏదిఏమైనా ఈ విషయం ఎలా ఉన్నా.. మరొక విషయం ఏమంటే.. ఇప్పటికే.. వరుస ఆరోపణలతో సతమతమవుతున్న ఈవో శీనానాయక్ కు త్వరలోనే బదిలీ వేటు పడనుందని విశ్వసనీయ వర్గాల నుంచీ అందిన సమాచారం. ఈవో ఇప్పటికైనా సంబంధిత నిధులను విడుదల చేస్తే.. వియంసికి ఏర్పడే మచ్చ కాస్త తొలగుతుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.