18 నెలల చిన్నారి హత్య కేసులో ఉరిశిక్ష
#firozabad #Uttarapradesh #Crime
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో 18 నెలల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు విరాజ్ అలియాస్ జితేంద్ర పాఠక్‌కు మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో కేవలం 40 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వడం విశేషంగా నిలిచింది. ప్రేమ సంబంధానికి చిన్నారి అడ్డుగా ఉన్నాడనే కారణంతో నిందితుడు బాలుడిని నేలకేసి కొట్టి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ దారుణ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో అవే కీలక సాక్ష్యాలుగా నిలిచాయి. తీర్పు అనంతరం నిందితుడు కోర్టు ప్రాంగణంలో తనను తాను కొట్టుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు కోర్టు తీర్పును స్వాగతించగా, చిన్నారులపై నేరాలకు కఠిన శిక్షలు తప్పవనే బలమైన సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.