పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించి చూపిస్తున్నారు..

Mar 29, 2026 - 12:05
 0  96
పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించి చూపిస్తున్నారు..

- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్, వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరికల సందర్భంగా ఎమ్మెల్సీ  కె. నాగబాబు, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి..

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించాలంటే పెద్దన్న పాత్ర పోషించాలి.." అని 2024 ఎన్నికలకు ముందు ప్రకటించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పరిపాలనలో, రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించి చూపిస్తున్నారని, పవన్ కళ్యాణ్  నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటే ఆయన సేవలు దేశ భవిష్యత్తుకు ఉపకరిస్తాయని శాసన మండలి సభ్యులు కె. నాగబాబు, రామ్ తాళ్లూరి స్పష్టం చేశారు. చిత్తూరు డిసిసి వైస్ ప్రెసిడెంట్ శ్రీ గుండాల రామ చంద్ర, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకుల గజేంద్ర, సమైక్య ఆంధ్ర పోరాట సమితి కన్వీనర్ ముని రత్నం శనివారం జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్, శాసన మండలి సభ్యులు కె. నాగబాబు పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నాగబాబు, రామ్ తాళ్లూరి లు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరస్పర అవగాహనతో కలిసి పనిచేస్తున్నారని, కూటమిలో చీలిక తేవాలని వైసీపీ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కూటమి నాయకులు, కార్యకర్తలపై ఉన్నదని అన్నారు. వైసీపీ కులాల మధ్య కుంపటి రాజేసి, కులాలను విడగొట్టి పైశాచిక ఆనందం పొందితే, కులాలను కలిపి ఐకమత్యం చాటిచెప్పిన ఘనత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి దక్కుతుందని వెల్లడించారు. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనేది పవన్ కళ్యాణ్  ప్రధాన అజెండా అని చెప్పారు. పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక సుదీర్ఘ కాలంలో అత్యద్భుతమైన ఫలితాలనిచ్చే అంతర్లీన ఆలోచనలు ఉంటాయని అన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్  మాట్లాడుతూ.. కొత్తగా పార్టీలో చేరే వారు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి కూటమి విధానాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. పార్టీలో చేరిన వారిలో అవినాష్, అభిలాష్, వేణు, సూరన్న, శ్రీ బాబు, రమేష్, రవి, దామోదర్ నాయుడు, మమత, ఎస్ మురదు, కిరణ్, జశ్వంత్, లక్ష్మీపతి, శ్రీనివాస రెడ్డి ఉన్నారు. జనసేన నాయకులు  రామదాసు చౌదరి, శివరామ్ జంగాల, చైతన్య పూల, కుమార్, భాస్కర రెడ్డి, డీకే చైతన్య, ముర్రల్ తదితరులు పాల్గొన్నారు.