విజయ్ సీఎం అవ్వాలంటే.. ఏం చేయాలి..?
#vijaydalapathi #tamilnadu politics #election #CM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరమైన చర్చకు తెర లేపాయి. ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అధికారంలోకి వస్తుందనుకున్న డీఎంకే ప్రతిపక్షంతో సరిపెట్టుకోగా.. కింగ్ మేకర్ అవుతాడనుకున్న సినీ నటుడు విజయ్ కింగ్ స్థానంలో కూర్చున్నారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ వందకు పైగా స్థానాల్లో విజయం సాధించింది. తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. అయితే ఈ మ్యాజిక్ ఫిగర్‌ను ఏ పార్టీ సింగిల్‌గా అందుకోలేదు. టీవీకే ఖాతాలో 110 సీట్లు చేరగా.. డిఎంకే ఒక దశలో మూడోస్థానానికి పడిపోయింది. మళ్లీ పుంజుకుని 80 స్థానాలతో సరిపెట్టుకుంది. అటు బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పిన అన్నా డీఎంకే కూడా 50 స్థానాలకే పరిమితం అయ్యింది.
ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో 3 పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెర లేపాయి. విజయ్ ఇప్పటికే మహాబలిపురం సమీపంలోని ఓ రిసార్టుకు గెలిచిన ఎమ్మెల్యేలు రావాలని ముందే ఆదేశించారు. అటు డీఎంకే, అన్నాడీఎంకే కూడా క్యాంపు రాజకీయాలకు సిద్ధమవుతోంది. గెలిచిన ఎమ్మెల్యేలతో ఆయా పార్టీల అధినేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అయితే అందరి దృష్టి మాత్రం ఇప్పుడు విజయ్ పైనే ఉంది. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పని సరిగా మరో పది నుంచి 15 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సిందే. ఆ పది మందిని ఎక్కడ నుంచి తీసుకువస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్.
విజయ్‌తో పొత్తు కోసం బీజేపీ పెద్దలు తొలి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందే విజయ్ కోసం రాయభారం నడిపారు. కానీ విజయ్ మాత్రం సింగిల్‌గానే పోటీ చేస్తామని తేల్చి చెప్పేశారు. అయితే విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు ఏఐఏడీఎంకే నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీని కాదని విజయ్‌తో చేతులు కలిపే సాహసం అన్నాడీఎంకే చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకం. అటు విజయ్ కూడా తాను సింగిల్‌గానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రభుత్వంలో ఇతర పార్టీల నేతలకు అవకాశం ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ఇదే సమయంలో విజయ్ ముందు మరో ప్రత్యామ్నాయం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల నుంచి గెలిచిన వారిని తన పార్టీలో చేర్చుకుంటే.. అప్పుడు వారంతా టీవీకే సభ్యులు అవుతారు కాబట్టి.. ప్రభుత్వ ఏర్పాటు సులువు అవుతుందనే మాట బాగా వినిపిస్తోంది. అందుకే అవకాశం లేకపోయినా కూడా డీఎంకే, అన్నాడీఎంకేలు కూడా క్యాంపు రాజకీయాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు ఎమ్మెల్యేలకు బదులుగా పార్టీ పెద్దలతోనే టీవీకే రాయభారం నడపాల్సి వస్తుందనేది విశ్లేషకుల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలంటే.. మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.