విజయ్‌కు ఒక న్యాయం.. బీజేపీకి మరో న్యాయమా?
#Vijay #TVK #TamilNaduPolitics #TNPolitics #Governor #BJP #DMK #AIADMK #Congress #PoliticalCrisis #TamilNadu #TVKVijay #RajBhavan #FloorTest #IndianPolitics
విజయ్.. ఇప్పుడు దేశమంతా వినిపిస్తున్న పేరు. పార్టీ ప్రారంభించిన రెండేళ్లలోనే తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏడీఎంకేను కాదని తమిళ ప్రజలు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి మెజారిటీ స్థానాలు కట్టబెట్టారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. మూడు పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 118 అయితే.. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు 108 స్థానాల దగ్గరే నిలిచిపోయింది. అయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ తర్వాత బలం నిరూపించుకుంటామని విజయ్ నేతృత్వంలోని టీవీకే సభ్యులు గవర్నర్‌ను కోరారు. ఇక్కడే బీజేపీ మార్క్ రాజకీయం చూపించారు గవర్నర్. ప్రభుత్వం ఏర్పాట చేయాలంటే.. 118 మంది ఎమ్మెల్యేలు కావాలని.. ముందు ఆ పేర్లతో ఉన్న జాబితాను తనకు ఇవ్వాలని ఆదేశించారు. అలా ఇచ్చిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
అయితే బీజేపీ పెద్దలు ఆడుతున్న డ్రామా అని విజయ్ అభిమానులత పాటు తమిళ ప్రజలు, ఇతర పార్టీల నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. విజయ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం వల్లే బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతోందని.. అదే విజయ్ బీజేపీ పెద్దలతో పొత్తు పెట్టుకుంటే.. ఈ పాటికే సీఎం అయ్యే వారని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. గవర్నర్ ప్రకటన అనంతరం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన వ్యవహారాలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అసలు మెజారిటీతో సంబంధం లేకుండా బీజేపీ అధికారం చేపట్టిన ప్రభుత్వాల వివరాలు ఇప్పుడు గూగుల్ ద్వారా ప్రజలకు తెలుస్తున్నాయి.
విజయ్‌కి ఒక న్యాయం.. బీజేపీ నేతలకు ఒక న్యాయం.. ఇది ఎలా..? అని సోషల్ మీడియా వేదికగా కాషాయ పార్టీ పెద్దలను, తమిళనాడు గవర్నర్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. అసెంబ్లీలో బలపరీక్షలో తాను నెగ్గకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసే అధికారం గవర్నర్ ఉంటుంది. కానీ ఆ విషయం గవర్నర్ మర్చిపోయారా అని నిలదీస్తున్నారు. నిజానికి 2017లో గోవాలో ఇదే పరిస్థితి తలెత్తిందని గుర్తు చేస్తున్నారు. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా 17 స్థానాలు సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్రవాది, గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీల మద్దతు కూడగట్టి బీజేపీ 13 స్థానాలు గెలుచుకుంది. అయితే గవర్నర్ మృదుల సిన్హా మాత్రం 17 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీని కాదని 13 స్థానాలు గెలిచిన బీజేపీ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ విధంగా మెజార్టీ లేని బీజేపీ మనోహర్ పారికర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్. కట్ చేస్తే ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత.. బలపరీక్ష సమయానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను నియోజకవర్గాల అభివృద్ధి కారణంగా చూపించి బీజేపీలో చేర్చుకున్నారు. ఇలా పార్టీ ఫిరాయించిన 10 మందిలో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కూడా లభించింది. మరి ఇదే సూత్రం విజయ్‌కి ఎందుకు వర్తించదు అని ప్రశ్నిస్తున్నారు.
ఇది గోవా విషయంలో మాత్రమే కాదు.. ఇంకా చాలా చోట్ల ఇదే మాదిరిగా గవర్నర్లు వ్యవహరించారు. 2014 మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి 123 స్థానాలే వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 22 స్థానాలు తక్కువగా ఉన్నప్పటికీ.. గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం.. దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఫ్లోర్ టెస్టులో బల నిరూపణ జరిగింది. 2019 ఎన్నికల్లో కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. అప్పుడు గవర్నర్ భగత్ సింగ్. ఆయన బీజేపీకి మొదట అవకాశం ఇచ్చారు. దీంతో రాత్రికి రాత్రే ఫడ్నవీస్, అజిత్ పవార్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఫ్లోర్ టెస్టులో బల నిరూపణ లేకపోవడంతో.. ప్రభుత్వం పడిపోయింది.
కర్ణాటకలో జరిగిన 2018 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 112 అయితే బీజేపీ 104 స్థానాలు మాత్రమే గెలిచింది. అయినా సరే.. అప్పటి గవర్నర్ వాజూబాయ్ వాలా మాత్రం యడియూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిచ్చారు. ఆ తర్వాత బల నిరూపణకు 15 రోజులు గడువు కూడా ఇచ్చారు. నాటి బీజేపీ పెద్దలు జేడీ ఎస్‌తో కలిసి సభలో మెజారిటీ నిరూపించుకుంది. మణిపూర్‌లో 2017లో కూడా బీజేపీ నియమిత గవర్నర్ ఇదే మాదిరి వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి 28 స్థానాలు వచ్చినప్పటికీ.. 21 స్థానాలు మాత్రమే గెలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నజ్మా అనుమతి ఇచ్చారు. సభలో మెజారిటీ చూపించాలని సూచించారు.
గవర్నర్‌కు స్వేచ్ఛ ఉంది. కానీ చివరికి మెజారిటీ నిరూపణ మాత్రం అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ ద్వారానే జరగాలి. మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా అవకాశం ఇవ్వడం ఇప్పుడు కొత్త విషయం ఏమీ కాదు. దేశంలో గతంలో చాలాసార్లు జరిగింది కూడా. ఎవరిని పిలవాలి అనే విషయం స్పష్టంగా రూల్ లేదు. అయినప్పటికీ.. ముందస్తు కూటమి, మెజారిటీ చూపగల పొత్తులు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఎన్నికల అనంతరం పొత్తులు.. ఇవి సర్కారీ కమీషన్ సూచనలు. కానీ ప్రస్తుత తమిళనాడు గవర్నర్ మాత్రం.. ఇవన్నీ పక్కన పెట్టి.. ఢిల్లీ పెద్దల చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయారనే విమర్శలు మూటగట్టుకున్నారు.