రాజీనామా చేసేదే లేదు..

#Bjp #Westbengal #trinamulCongress #Mamatha benergy

May 5, 2026 - 17:31
 0  2
రాజీనామా చేసేదే లేదు..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఎన్నికల తీరుపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తాము ఓడిపోలేదని, తమకు దక్కాల్సిన విజయాన్ని కేంద్రం కుట్రపూరితంగా దొంగిలించిందని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను కేంద్ర బలగాలు, ఎన్నికల కమిషన్ కలిసి ఖూనీ చేశాయని ఆమె మండిపడ్డారు. తాము శత్రువులతో పోరాటం చేశామని, ఎన్నికల్లో ప్రధాన శత్రువు ఎన్నికల సంఘం అని ఆమె ఆరోపించారు. 

ఈ సందర్భంగా తన పదవిపై వస్తున్న ఊహాగానాలకు మమతా బెనర్జీ స్పష్టమైన ముగింపునిచ్చారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ప్రజా తీర్పును వక్రీకరించిన చోట రాజీనామా ప్రశ్నే ఉత్పన్నం కాదని, తాను లోక్‌భవన్‌కు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం వీధి పోరాటాలు చేస్తామని, బెంగాల్ హక్కుల కోసం తన గొంతుక వినిపిస్తూనే ఉంటానని దీదీ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం బిజెపికి అలవాటని ఆమె మండిపడ్డారు. 

100 స్థానాల్లో తమ విజయాన్ని లాక్కున్నారని ఆమె విమర్శించారు. ఎన్నికల కమిషన్ తీరుపై ధ్వజమెత్తుతూ, బీజేపీ కంటే ఎక్కువగా తాము ఈసీతోనే పోరాడాల్సి వచ్చిందని మమతా అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందని, మన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. ఈ అన్యాయంపై జాతీయ స్థాయిలో గళం విప్పుతామని, 'ఇండియా' కూటమిని మరింత బలోపేతం చేసి బీజేపీని గద్దె దించుతామని దీదీ శపథం చేశారు.