సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ.. దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
#sarkaar express #tamilnadu #kakinada
తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోరీ ఘటన కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత బాపట్ల సమీపంలోని నల్లమడ వాగు రైల్వే వంతెన వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్-3, ఎస్-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల నుంచి దుండగులు సుమారు ఏడు సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు సమాచారం.
చోరీ అనంతరం చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. దొంగలు రైలు దిగి పొలాల మార్గంలో పారిపోతుండగా, ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు వారిని అడ్డుకునేందుకు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అప్పికట్ల–బత్తిపూడి గ్రామాల పరిసర పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ చోరీకి ఆరుగురు దుండగులు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.