షెడ్యూల్ 9,10 ఉద్యోగులకు 62 ఏళ్ల రిటైర్మెంట్ అమలు చేయాలి: ఫోరం
* 62 సంవత్సరాల పదవీ కాలాన్ని విద్యుత్ ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలి
* సీఎంకు వినతి పత్రం అందజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ ఫోరం సభ్యులు
అమరావతి, ఏప్రిల్ 24, : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ కాలాన్ని 60 నుంచి 62 సంవత్సరాలకు షెడ్యూల్ 9,10 ఉద్యోగులయిన విద్యుత్ ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాల పదవీ కాలాన్ని వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా శుక్రవారం నాడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జి. రామకృష్ణుడు కలిసి సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు.
2017 లో రాష్ట్ర ప్రభుత్వం 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పెంచినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు, షెడ్యూల్ 9,10 ఉద్యోగులందరికీ సమానంగా అన్వయించి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 60 నుంచి 62 సంవత్సరాల పదవీ కాలాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పొడిగించి షెడ్యూల్ 9, 10 ఉద్యోగులకు ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యగా షెడ్యూల్ 9,10 ఉద్యోగులందరికీ పెరిగిన రెండు సంవత్సరాల పదవీ కాలాన్ని అన్వయించేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ నియమించి, వారికి రిపోర్టు చేయడం జరిగిందని దానిలో విద్యుత్ శాఖ ఉద్యోగులను మినహాయించడం జరిగిందన్నారు. 62 సంవత్సరాల పదవీకాలం పొడిగింపులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యుత్ శాఖను మినహాయించడం తగదనీ జనరల్ సెక్రటరీ ఎస్.కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎం. సత్యానందం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు తమకు కూడా 62 సంవత్సరాల పదవీ కాలాన్ని వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లు ఎం శ్రీనివాసరావు, ఎస్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.