మౌనమేలనోయీ కమలనాథా..?
#BJP #pawan kalyan #janasena #politics #ప్రశ్న రావణ్
ప్రశ్న రావణ్ విషయంలో రాష్ట్రం వేడెక్కిపోయింది. సోషల్ మీడియా అయితే రావణకాష్టంలా రగిలిపోతుంది. ఏ రీల్ చూసినా.. ఏ వీడియో చూసినా.. జోసెఫ్ కు మద్దతుగానో.. వ్యతిరేకంగానో... పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగానో..అనుకూలంగానో ఉంటున్నాయి. రావత్ తో సహా అన్నీ వైసీపీ స్పాన్సర్డ్ అని సీఎం చంద్రబాబు సైతం ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని బిజెపి నేతలు మాత్రం మౌనంగా ఉన్నారు. మంత్రి సత్యకుమార్ సైతం రాజధాని వ్యవహారంలో జగన్ పై దండెత్తారు తప్ప.. ఈ విషయంలో నోరిప్పలేదు. ఎందుకు?
గతంలో తిరుమల లడ్డు వ్యవహారంలోనూ బిజెపి ఇలాగే చేసింది. జగన్ కు వ్యతిరేకంగా నడిచే ఏ ఎపిసోడ్ లోనూ బిజెపి ప్రత్యక్షంగా ముందుకు రావడం లేదు. ఇప్పుడు ప్రశ్న రావణ్ వ్యవహారంలోనూ అంతే. అసలు తిరుమల లడ్డు విషయం వెంకన్న భక్తి వ్యవహారం అయినా సీరియస్ గా బిజెపి ఇన్ వాల్వ్ కాలేదు. ఇప్పుడు ప్రశ్న రావణ్ వీడియోలన్నీ హిందూత్వ వ్యతిరేకం అయినా గాని ఇప్పటివరకు బిజెపి నేతలు స్పందించలేదు. పైగా రావణ్ మాట్లాడిన విధానం తప్పని తెలిసినా అతడు బిజెపికి వ్యతిరేకంగా వీడియోలు చేశాడనే లెఫ్ట్ నెత్తిన పెట్టుకుంది. అతడి భాషతో సంబంధం లేకుండా నిరభ్యంతరంగా ఓపెన్ గా లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయినా బిజెపి నేతలు మాత్రం గడప దాటడం లేదు.
దీనికి రెండు కారణాలు అయి ఉండాలి. ఒకటి తమ పాత్ర పోషించమని పవన్ కల్యాణ్ కు బిజెపి వదిలేసి ఉండాలి. లేదా జగన్ అనే ఆప్షన్ ను వదులుకోవడానికి బిజెపి సిద్ధంగా లేదని అయినా అనుకోవాలి. సనాతన ధర్మం మొదలు.. బిజెపి సిద్ధాంతాలను పవన్ అగ్రెసివ్ గా ముందుకు తీసుకుపోతున్నాడు. దీని వలన తనకు రాజకీయంగా నిలకడ లేదనే ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా ఉగ్రవాద నిరోధక చట్టం లాంటి సీరియస్ సెక్షన్ వాడింది ఇప్పటివరకు బిజెపియే ఎక్కువ. అలాంటిదానిని ఏపీలో ముందుకు తెచ్చారంటే బిజెపి సలహా లేకుండా పవన్ చేశారని అనుకోలేం. అంటే అటు పవన్ ను డైరెక్ట్ చేస్తూ.. ఇటు జగన్ ఆప్షన్ ఉంచుకుంటూ ఏపీలో అధికారమే లక్ష్యంగా మోదీ, షాలు పావులు కదుపుతున్నారని అనుకోవాలి.
లేదా ఒక రాజకీయ యజ్ణం నిర్వహిస్తూ.. అందులో కేవలం పండితుడి పాత్ర పోషిస్తూ.. పవన్ కల్యాణ్ లాంటి నాయకుడిని భవిష్యత్ కు సిద్ధం చేస్తుందని అయినా అనుకోవాలి.
ఈ చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఎందుకంటే హిందూత్వకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ సహజంగా రియాక్ట్ కావాల్సింది బిజెపి నేతలు.. మరి వారెందుకు నోరు మెదపడం లేదు. పైగా రాష్ట్రంలో పరిస్ధితి ఇంతగా మారిపోయినా కూడా మాట్లాడటం లేదు. అంటే వారికి ఖచ్చితంగా పై నుంచి ఆదేశాలు వచ్చి ఉండాలి. తిరుమల లడ్డు విషయంలోనూ తమ నోరు కట్టేశారని.. తమను కట్టడి చేశారనే మాటలు కొందరు బిజెపి నేతలు ఇన్ ఫార్మల్ గా చెప్పుకున్నారు కూడా.
ఈశాన్య రాష్ట్రాల నుంచి బిజెపి ఒకటే పార్ములా ఫాలో అవుతుంది. ఎవరో ఒక నాయకుడిని అద్దెకు తెచ్చుకుని అతని ద్వారా అధికారం తెచ్చుకోవడమే ఆ ఫార్ములా. అసోంలో హిమంతను తెచ్చుకుని సాధించారు. బెంగాల్ లో సువేందు అధికారి ఎగ్జాంపుల్స్. అలాగే ఏపీలో పవన్ కల్యాణ్ ను వాడుతోంది బిజెపి. పవన్ సైతం బిజెపికి బాగా ట్యూన్ అయినట్లే కనపడుతోంది. బహుశా అందుకేనేమో ప్రశ్న రావణ్ విసయంలో బిజెపి నేతలకు పని లేకుండా చేశారేమో.