బెజవాడ దుర్గమ్మ ఆలయంలో టికెట్స్ గోల్‌మాల్
#andhrapradesh #vijayawada #kanakadurgamma temple #ticket scam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో టికెట్ల గోల్‌మాల్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆలయ ఆదాయానికి గండి కొట్టేలా కొంతమంది సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే రెండు వేర్వేరు ఘటనలు బయటపడటంతో దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలపై దేవస్థానం ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
ఇప్పటికే నకిలీ రూ.500 ప్రత్యేక దర్శన టికెట్ల వ్యవహారంలో హోంగార్డ్ చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకున్న అధికారులు ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో ఘటనలో ఇద్దరు ఉద్యోగులు టికెట్ల నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో వారిని విధుల నుంచి తొలగించినట్లు ఈవో వెల్లడించారు. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.