ఏదో జరుగుతోంది...?
#Pawan Kalyan #naralokesh #politics #TDP #Janasena #Chandrababu naidu #narendra modi #BJP
అవును.. ఏదో జరుగుతుంది. కూటమిలో ఐక్యత నివురు గప్పిన నిప్పులా అటు ఇటు ఊగుతుందా? ఇగో క్లాషెస్, డామినేషన్లతో మొదలైన అంతర్గత విబేధాలు.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వార్ లా మారబోతున్నాయా? అదే అనిపిస్తుంది. పవన్ కల్యాణ్ మాటలు వింటుంటే అది నిజమే అనిపిస్తుంది. చూడటానికి రాజకీయ వ్యూహంలా కనపడుతున్నా దాని వెనక మా ఐడెంటిటీ మేం కోల్పోము.. మీరేది చెబితే అది వినము అని పవన్ స్పష్టంగా చెప్పినట్లే అనిపిస్తుంది. గత కొన్నాళ్లుగా పార్టీలో అంతర్గతంగాను, బయట నుంచి కొందరు కాపు నేతలు అదే పనిగా పవన్ పై చేస్తున్న విమర్శ ఏంటంటే.. టీడీపీ ఏది చెబితే అది ఓకె చేస్తే ఎలా... మన పరిస్ధితి ఏంటి మన భవిష్యత్ ఏంటి పట్టించుకోరా? అని. దీనికి సమాధానంలానే ఉంది ప్రస్తుతం పవన్ చేసిన కామెంట్స్. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు పోటీ చేసింది అప్పటి పరిస్ధితులకే పరిమితం.. ఇప్పుడలా కాదు.. స్ధానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేశారు. ఇది చివరి వరకు ఉంటుందా? లేక అసంతృప్తిని చల్లార్చడానికి ఇరుపార్టీల అధినేతల ఆడుతున్న డ్రామానా అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశాలకు రాకపోవడం... అసలు అసెంబ్లీకి హాజరు కాకపోవడం వెనక ఏముందనే చర్చ ఇప్పటికే జరుగుతుంది. ఆరోగ్యం బాగోలేదనే విషయం అందరికీ తెలుసు.. కాని పార్టీ సమావేశాలకు, రివ్యూలకు, పైగా ఆయన మంత్రిత్వ శాఖ సమావేశాలకకు కూడా రాని అనారోగ్య సమస్య .. కేబినెట్ సమావేశాలకు, అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వస్తుందనేది ప్రశ్న. కేబినెట్ సమావేశంలో కంటిన్యూగా కూర్చోవడం ప్రాబ్లెమ్ అయితే.. అసెంబ్లీ సమావేశానికి అలా వచ్చి కాసేపు కనపడి వెళ్లడానికి ఏమైందని కొందరు అడుగుతున్నారు. ఇప్పుడు కేరళకు 20 రోజుల పాటు ఆరోగ్యం కోసమే ట్రీట్ మెంట్ కోసమే వెళుతున్నట్లు ప్రకటించారు. దీనిని ఎవరూ కాదనలేరు.. అడగలేరు. కాని ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజునే జనసేన ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించిన పవన్ అసెంబ్లీకి ఎందుకు రాలేదు? ఇక అమరావతి చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ప్రభుత్వానికి. ఇది అందరికీ తెలిసిందే. కాని అమరావతి 2.0 సభకు మోదీ వచ్చినప్పుడు హాజరైన పవన్ కల్యాణ్.. ఇక మరీ ఏ రోజూ అమరావతిని విజిట్ చేయలేదు. ఎందుకు?
కొందరైతే ఇది అంతర్గతంగా నడుస్తున్న వివాదాల కారణంగానే అంటున్నారు. ఇవి ఊహాగానాలు మాత్రమే అని ఇరు పార్టీల వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం వచ్చాక అదికారుల నియామకాలు, బదిలీలు అప్పుడే సమస్య మొదలైందని ఆరోపణలు వినపడుతున్నాయి. లోకేష్ ఆధిపత్యాన్ని పవన్ ప్రశ్నించారని అంటున్నారు. చంద్రబాబు పవన్ లో చాలా సఖ్యతగా ఉన్నట్లు కనపడుతుంది.. కాని లోకేష్, పవన్ మధ్య చంద్రబాబు ఇబ్బంది పడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. లోకేష్ బహిరంగ సభల్లో అన్నయ్య పవన్ కల్యాణ్ అంటున్నా.. నిర్ణయాల విషయంలో మాత్రం తన దారి తనదే అన్నట్లు చెప్పుకుంటున్నారు. టీడీపీలోనూ, ప్రభుత్వంలోనూ ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తుంది లోకేష్ అన్నది అందరికీ తెలిసిందే. అదే ఆచరణలో కొన్నిసార్లు పవన్ ఇగో హర్ట్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ విషయంలో కులం ఆధారంగా వైసీపీ పవన్ ని టార్గెట్ చేసింది. అయినా లోకేష్ ఏమీ మాట్లాడలేదు. మంత్రులు కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఎలా అని చంద్రబాబు ఓపెన్ గానే మందలించారు. పవన్ పై ఎలాంటి రాజకీయ దాడి జరిగినా చంద్రబాబు అన్నా స్పందిస్తున్నారు గాని.. ఇతర టీడీపీ నేతలు స్పందించడం లేదు. తర్వాత యూట్యూబర్ రావణ్ విషయంలోనూ అదే జరిగింది. చంద్రబాబు నేరుగా ఇన్ వాల్వ్ అయి చెప్పాకే మిగతా టీడీపీ నేతలు, మంత్రులు రంగంలోకి దిగి మాట్లాడారు. అప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మరోవైపు నేడు డీఎస్సీపై లోకేష్ ను వైసీపీ టార్గెట్ చేస్తే.. పవన్ వైపు నుంచి కూడా సరైన స్పందన లేదు. మొదట్లో ఒకసారి మాత్రమే వైసీపీ ప్రచారాన్ని ఖండించారు. కాని తర్వాత పట్టించుకోలేదు. బయటి నుంచి చూస్తూ ఇలాంటి గ్యాప్ బాగా కనపడుతోంది. మరోవైపు లోకేష్ సీఎం అవటానికి పవన్ కల్యాణే అడ్డు అని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.. అందుకే దాగుడుమూతలు ఆడుతూ అటు నుంచి దాడి చేస్తున్నారని కూడా చర్చ నడుస్తోంది. ఒక జనసేన ఎన్నారైకి.. ఒక పదవి ఇస్తే.. అతను గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేశాడని అందుకే అతనికి పదవి ఇవ్వకూడదని సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు గట్టిగానే అభ్యంతరాలు చెప్పారు. దీనికి మహాసేన రాజేష్ కు టిక్కెట్ వ్యవహారానికి పోలిక పెట్టారు. దీంతో జనసేన కేడర్ నుంచి కూడా గట్టిగా కౌంటర్లు వచ్చాయి. ఇరు పార్టీల కేడర్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది.
రేపు పరిస్ధితులు మారితే బిజెపి పవన్ ను ముందు పెట్టి కధ నడిపిస్తుందనే అనుమానాలు టీడీపీలో ఇప్పటికే ఉన్నాయి. అందుకే పైకి స్నేహంగా కనపడుతూ ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు.