కుటుంబమంతా ఆత్మహత్య.. ఫోన్ పే పిన్ నంబర్ రాసి..
#andhrapradesh #chittoor district #family suicide
చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, దాము (30), నిర్మల (25) దంపతులు తమ ఇద్దరు చిన్నారులకు విషమిచ్చిన అనంతరం తాము ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నిర్మల కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, కుటుంబం ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్లే దంపతులు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో దాము తన ఏటీఎం పిన్‌తో పాటు ఫోన్‌పే పిన్ వివరాలను పేర్కొన్నట్లు సమాచారం. తమ అంత్యక్రియల కోసం అవసరమైన ఖర్చులను తన బ్యాంకు ఖాతాలోని డబ్బుతోనే నిర్వహించాలని అందులో కోరినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.