తిరుమలలో సుప్రభాత సేవ పేరుతో మోసం
#సుప్రభాతసేవ #తిరుమల #తిరుపతి #ఆంధ్రప్రదేశ్ #scam #భక్తులు
తిరుమలలో సుప్రభాత సేవ కల్పిస్తామని చెప్పి దళారులు 60 మంది భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖల ద్వారా ప్రత్యేకంగా సుప్రభాత సేవ టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికి భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కో భక్తి నుంచి రూ.6 వేల చొప్పున తీసుకుని, మొత్తం రూ.3.60 లక్షలను ఫోన్‌పే ద్వారా తమ ఖాతాలకు జమ చేయించుకున్నట్లు బాధితులు తెలిపారు.
నిర్దేశించిన సమయానికి తిరుమలకు చేరుకున్న భక్తులు సుప్రభాత సేవ టికెట్లు అందకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూసిన బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం టీటీడీ అధికారులను సంప్రదించి జరిగిన విషయాన్ని వివరించారు. ఘటనపై ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో దళారుల మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.