పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలో నెం.1గా ఆంధ్రప్రదేశ్
#Andhrapradesh #PM SHRI #naralokesh #narachandrababunaidu #apcm
ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంశ్రీ (PM SHRI) పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన అధికారులను మంత్రి అభినందించారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. కడప మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని ఈ ఏడాది 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని వేగవంతం చేసి మెగా పీటీఎం నాటికి పూర్తి చేయాలని సూచించారు.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న 1.06 లక్షల మందికి పైగా విద్యార్థినుల కోసం 53,180 బంక్ బెడ్ల ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేజీబీవీలతో పాటు ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల్లో కూడా ఈ సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 2.03 లక్షల మంది విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు అందజేస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల అనుమతుల్లో అనవసర నిబంధనలను తొలగించాలని, ఫీజు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు.
అనాథ పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ పథకం ప్రయోజనాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. అవసరమైతే నిధులను నేరుగా జిల్లా కలెక్టర్ల ద్వారా లేదా పిల్లల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానంపై పరిశీలించాలని సూచించారు.
తెలుగు అకాడమీ పుస్తకాలను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వేదికల ద్వారా విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. దీంతో ప్రజలు సులభంగా పుస్తకాలను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, హాజరు శాతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పాఠశాలల్లో హాజరు శాతం 95 శాతం కంటే తక్కువ కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
పబ్లిక్ పరీక్షల్లో తెలుగు, గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబడుతున్నారని అధికారులు వివరించగా, మాతృభాష తెలుగు బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని లోకేష్ సూచించారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఫలితాలు మెరుగుపరచాలని చెప్పారు.
హైస్కూల్ విద్యార్థులకు క్రోమ్‌బుక్స్‌తో కూడిన కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యా రంగంలో నాణ్యత, సాంకేతికత, సమాన అవకాశాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నారా లోకేష్ స్పష్టం చేశారు.