వైసీపీ నేతలకు బిగుస్తున్న కేసుల ఉచ్చు
#andhrapradesh #kodalinani #ycp #politics
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) ఉల్లంఘన, అభ్యంతరకర వ్యాఖ్యల ఆరోపణలపై 2021 ఫిబ్రవరి 16న గుడివాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
విచారణ సందర్భంగా సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో కేసు న్యాయపరంగా ముందుకు సాగే అవకాశం ఏర్పడింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల పలువురు వైసీపీ నేతలపై నమోదైన పలు కేసులు మళ్లీ తెరపైకి వస్తున్న నేపథ్యంలో కొడాలి నాని కేసు కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ వ్యవహారంపై కొడాలి నాని లేదా వైసీపీ నాయకత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.