టీబీజేపీ నేతలకు నితిన్ నబీన్ గట్టి హెచ్చరిక
#నితిన్ నబీన్ #తెలంగాణ #బీజేపీ
తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కీలక సూచనలు చేస్తూ గట్టి హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేయాలంటే ముందుగా కుల రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన స్పష్టం చేశారు. "కుల పిచ్చి బంద్ చేయండి.. మీరు ఇలాగే కొనసాగితే పార్టీ ముందుకు వెళ్లదు.. ఇకనైనా మారండి" అంటూ నేతలకు నేరుగా సూచించినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాలు, వర్గ రాజకీయాలకు బదులుగా పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. "పార్టీ ఫస్ట్.. లీడర్ నెక్స్ట్" అనే సూత్రాన్ని ప్రతి నాయకుడు పాటించాలని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే అందుకు నేతలంతా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్గత విభేదాలు, కుల ఆధారిత రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నితిన్ నబీన్ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.