డాక్టర్ ప్రవీణ్ కుమార్‌కు  రాష్ట్ర ప్రభుత్వ "ఉత్తమ వైద్య సేవా" పురస్కారం"

Apr 10, 2026 - 11:35
 0  1
డాక్టర్ ప్రవీణ్ కుమార్‌కు  రాష్ట్ర ప్రభుత్వ "ఉత్తమ వైద్య సేవా" పురస్కారం"

హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి పంచకర్మ నిపుణులు, ఆయుర్వేద మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆయుష్ విభాగంలో *రాష్ట్ర స్థాయి "ఉత్తమ వైద్య సేవా పురస్కారం"* అందించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న 99రోజుల "ప్రజా పాలన-ప్రగతి నివేదిక" కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, ఆరోగ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చంగ్దు చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. 

సాధారణంగా వైద్యులు రోగిని పరిశీలించి మందులు ఇచ్చి పంపిస్తారు. కానీ, డాక్టర్ ప్రవీణ్ కుమార్ రోగులతో మాట్లాడతారు. వారి బాధలు వింటారు. వారి జీవన శైలిని అర్థం చేసుకుంటారు. ఆ మాటలతోనే, ఆ శ్రద్ధలోనే సగం వ్యాధి తగ్గిపోతుందని రోగులు చెబుతుంటారు. ఆయుర్వేదపు పురాతన చికిత్సా పద్ధతి అయిన పంచకర్మను ఆధునిక అవసరాలకు తగినట్టుగా సమ్మిళితం చేస్తూ, ఆయన వందలాది రోగులకు కొత్త జీవితాన్ని అందించారు. ఇంకా అందిస్తూనే ఉన్నారు. ఆయన వద్ద చికిత్స పొందిన రోగులు.. డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను ఆయుర్వేద వైద్య వ్యవస్థలో కలికితురాయిగా అభివర్ణిస్తారు.

డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి అనుబంధ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గా కూడా వందలమంది వర్ధమాన వైద్యులను తయారు చేయడంలో తన పాత్ర పోషిస్తున్నారు. 

ఆయుర్వేదం కేవలం మూలికల వైద్యం మాత్రమే కాదని, అది మనిషిని సమగ్రంగా చూసే విజ్ఞానం అని, పంచకర్మ చికిత్స ద్వారా శరీరం, మనసు రెండూ స్వస్థత పొందుతాయని, అదే మన ప్రాచీన వైద్య వారసత్వం అని డాక్టర్ ప్రవీణ్ కుమార్ చెబుతారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని డాక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు.