అమ్మా ఇది నీకు తెలుసా..?
నిజమేంటో నువ్వే చెప్పాలి దుర్గమ్మ తల్లీ..
కుమార్ చంద్. పి
అమ్మా దుర్గమ్మా అంటూ.. చెయ్యెత్తి మొక్కితేనే.. ఎన్ని కష్టాలనైనా దరిచేరనివ్వదా కనకదుర్గమ్మ.. అటువంటి అమ్మకే తెలియకుండా కొందరు వ్యక్తులు అమ్మ సన్నిధిలో అపచారాలకు ఒడిగడుతుండటం ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై చర్చనీయాంశమైంది. అమ్మవారి సన్నిధిలో ఆమె చల్లని చూపును పొందాలని వస్తున్న భక్తులను ఓ వైపు దోచుకుంటున్నారు కొందరు వ్యక్తులు.. మరొక వైపు అమ్మవారి సన్నిధైన ఇంద్రకీలాద్రిని సంరక్షించాల్సిన ఉన్నతాధికారే.. తప్పు చేసిన దుర్గగుడి ఉద్యోగులను శిక్షించాల్సింది పోయి.. వారి వద్ద నుంచే ముడుపులను(లంచాలు) తీసుకుంటూ అమ్మవారి ఖజానాకు గండికొడుతున్నాడు. లడ్డూ టోకన్ ఒక్కటే..కానీ ఇచ్చిన లడ్డూలెన్నో ఉన్నాయి. ఈ అవినీతి భాగోతం తెలిసిన దుర్గగుడి ఉన్నతాధికారి వెంటనే వారిపై చర్యలు చేపట్టలేదు. కానీ వెంటనే అపరాధ రుసుం కట్టాలని హుకుం జారీ చేసాడు. అస్సలు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గ గుడిలో జరుగుతున్న అవినీతి చిట్టాలేంటి అన్న విషయాలను ఈ రోజు పాయింట్ మీడియాలో ఎక్స్క్యూజివ్ గా చూద్దామా..?
|
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి సన్నిధి అంటేనే ఓ ప్రత్యేకం. దసరా శరన్నవరాత్రులకు దేశవిదేశాల నుంచీ దూర సుదూర ప్రాంతాల నుంచీ భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. అలాగే.. మిగిలిన రోజుల్లోనూ అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. అటువంటి దేశంలోనే ఉన్న అమ్మవారి దేవస్థానాలలో ఒక ప్రత్యేక దేవస్థానంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ గుడికి పేరుంది. ఈ దేవస్థానం దేవాదాయ శాఖ పరిధిలో ఉండటం వల్ల దీనిని ప్రభుత్వం ఓ ప్రత్యేకమైన దేవస్థానంగా పరిగణిస్తూ అన్ని విధాలైన సౌకర్యాలను ఈ గుడిలో ఏర్పాటు చేస్తూ వస్తోంది. అందుకే ఈ గుడిలో ఉన్నతాధికారులు కావచ్చు.. దేవస్థానం బోర్డు కావచ్చు అందరూ ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడాల్సి ఉంటుంది. కానీ రానురానూ ఆ విధానం మారిపోయి.. పూర్తిగా లోపభూయిష్టంగా మారిపోయింది దుర్గగుడి నిర్వహణ వ్యవహారం. |
|
దుర్గగుడిలో ప్రస్తుతం ఓ వ్యవహారం చాలా రోజులుగా మరుగున పడిపోయి.. గుడిలో ఉన్న సిబ్బంది మధ్యే ఒకరి చెవుల్లో ఒకరు ప్రతిసారి గుసగుసలాడుకునేలా నానుతోంది. అదేంటంటే.. గుడిలో ఉన్న లడ్డూల కౌంటర్ లో కొందరు సిబ్బంది.. ఒకే టోకెన్ కు పెద్ద మొత్తంలో లడ్డూలను కొట్టారన్న విషయం దుర్గగుడిలో ఉన్న ఉన్నతాధికారి చెవిన పడింది. ఆయనేదో చేసేస్తాడని భయపడిన ఆ అపరాధులు ముగ్గురినీ పిలిచాడు ఆ సదరు ఉన్నతాధికారి. పిలిచింది శిక్షించేందుకు అనుకుని వెళ్ళిన ఆ ముగ్గురికి ఓ ట్విస్ట్ ఇచ్చాడా ఉన్నతాధికారి.. అదేంటంటే.. తప్పును కాయాలంటే.. అందుకు ఒక్కొక్కరూ 5 లక్షల రూపాయల ముడుపులను(లంచాన్ని) ఇవ్వాలని డిమాండ్ చేశాడట. దీంతో ఏమీ చేయలేమని తెలుసుకుని ఆ ముగ్గురు గుట్టు చప్పుడు కాకుండా ఆ 5 లక్షలను ఇచ్చుకున్నారట. తనకు తాను ఎంతో నిజాయితీపరుడిగా గెటప్ ఇచ్చుకునే ఆ సదరు ఉన్నతాధికారి ఈ విషయం ఎక్కడా పొక్కకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడట. |
|
ఇక మరొక వ్యవహారం ఏంటంటే.. గుడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గుడిపైన ఓ లగేజి కౌంటర్ ను ఏర్పాటు చేసారు. ఈ కౌంటర్ లో చెప్పులకు 3 రూపాయలు, బ్యాగులకు 10 రూపాయలు తీసుకోవాల్సిందిగా దేవస్థానం నిర్ణయించింది. అయితే ఇందుకు భిన్నంగా లగేజి కౌంటర్ ను నిర్వహించే నిర్వాహకులు బ్యాగుకు 20 నుంచీ కుదిరితే అంటే వచ్చే భక్తులు నాన్ లోకల్ అనుకుంటే.. 60 రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు. ఇటీవలే ఓ భక్తులు తన వద్ద 60 రూపాయలు తీసుకున్న వైనాన్ని ప్రోటోకాల్ లో నివేదించాడు.. కంప్లైంట్ ఇచ్చాడు. దీనిపై ప్రోటోకాల్ సిబ్బంది స్పందించకపోగా.. అతనికి సర్ధి చెప్పి పంపేసాడు. దీంతో ఈ విషయం అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. కానీ ఆ విషయాన్ని అక్కడితో మూసేసారు. దీనికి కారణమూ లేకపోలేదు.. ఆ సదరు లగేజి కౌంటర్ ప్రస్తుతం ప్రభుత్వానికి చెందిన పార్టీలో సీనియర్ నాయకుడు, ఒకప్పడు ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి మేనల్లుడిది కావటమే. మరొక విషయం ఏంటంటే.. సదరు లగేజి కౌంటర్ ను పాడుకున్నది కూడా కొన్ని కోట్ల రుసుముతోనే.. దీంతో ఆ డబ్బును ఎంత త్వరగా వసూలు చేద్దామా అన్న లక్ష్యంతో లగేజీ బ్యాగులు, చెప్పులపై అధిక మొత్తాల్లో డబ్బులను వసూలు చేస్తున్నారని బహిరంగ రహస్యం. మరొక విషయమేమంటే.. ఈ లగేజి కౌంటర్ ప్రస్తుతం రెడ్ జోన్ లో ఉండటం గమనార్హం. అదేవిధంగా బ్లాక్ జోన్ లోనికి కనుక వెళితే.. సదరు కాంట్రాక్టును రద్దు చేయవచ్చు కూడా.. అయినా కూడా ఇంకా ఇటువంటి కౌంటర్లపై దుర్గగుడి ఉన్నతాధికారులు చర్యలు చేపట్టటం లేదంటే విస్మయానికి లోనవ్వాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. |