డబ్బులు పారేస్తా..పొమ్మంటున్న ప్రేమికుడు
కుమార్ చంద్ పుల్లగూర
తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి నిన్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ లో నిర్వహించే స్పందనను ఆశ్రయించింది. తాను ఆశ్రయించిన అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో సరిగ్గా న్యాయం జరగలేదంటూ పోలీసు ఉన్నతాధికారి వద్ద వాపోయింది. వివరాల్లోనికి వెళితే.. అజిత్ సింగ్ నగర్ కు చెందిన 21 సంవత్సరాల యువతి ఓ యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ కొంతకాలం కలిసి ఉండగా.. అనంతరం ఆమె గర్భిణి వచ్చింది. దీంతో సదరు యువకుడు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆబార్షన్ ను చేయించాడు. ఈ ఉదంతమంతా యువకుని తల్లిదండ్రులకు తెలియటం గమనార్హం. ఈ పరిణామాల అనంతరం యువకుడు యువతిని పెళ్ళి చేసుకోనని తెగేసి చెప్పేసి మొహం చాటేశాడు. దీంతో బాధిత యువతి అజిత్ సింగ్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఫిర్యాదు స్వీకరించిన అజిత్ సింగ్ నగర్ సిఐ గత నెల 24న ఎఫ్ఐఆర్ ను బుక్ చేశారు. అనంతరం సదరు యువతికి వైద్య పరీక్షలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగాయి. రిపోర్టు కూడా యువతికి అనుకూలంగానే రావటంతో యువకుడి తరపు వాళ్ళు బేరసారాలకు దిగారు. కానీ యువతి మాత్రం తనను ఆ యువకుడు పెళ్ళి చేసుకోవాలంటూ పట్టుపట్టింది. ఈ నేపధ్యంలో యువతి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వివరణ అడుగగా... అజిత్ సింగ్ నగర్ సిఐ చంద్రశేఖర్ యువతి చిన్నబోయే విధంగా మాట్లారని బాధిత యువతి పాయింట్ మీడియాకు తెలిపింది. తనకు న్యాయం చేయకపోగా.. తన ఫిర్యాదు పట్ల నిర్లక్ష్య వైఖరితో సిఐ ఉన్నారంటూ ఆరోపించింది. ఈ నేపధ్యంలోనే తనకు న్యాయం జరుగదన్న ఉద్దేశ్యంతో నిన్న ఎన్టీఆర్ పోలీస్ కమీషనరేట్ కమీషనర్ కార్యాలయంలో ఉన్న స్పందనను ఆశ్రయించింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను వేడుకుంది.