దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్

Jun 3, 2026 - 12:11
 0  8
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్

స్వతంత్ర భారత దేశంలో 1950లో వెలువడిన ప్రెసిడెంట్ ఆర్డర్ దళిత క్రైస్తవులకు తీవ్రమైన అన్యాయం చేసే విధంగా ఉందని, ఆ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని లేదా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ పునఃసమీక్ష (అమెండ్మెంట్) చేయాలని ఆలిండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధనలో భాగంగా ఈ నెల 4వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద “ఆత్మగౌరవ మహాధర్నా” నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

విజయవాడ లబ్బీపేటలో మంగళవారం ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ మాట్లాడుతూ, దళితుల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. వివక్ష పూరిత చట్టాలు మారాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారం హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ సౌకర్యాలు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు ఈ ఆర్డర్ నుంచి మినహాయింపులు ఇచ్చి ఎస్సీ సౌకర్యాలు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సమాజంలో అంటరానితనం, వివక్ష భరించలేక క్రైస్తవ మతాన్ని స్వీకరించిన అట్టడుగు వర్గాల ప్రజలకు నేటికీ హక్కులు నిరాకరించడం అన్యాయమని ఆయన ప్రశ్నించారు. బీసీ, ఓసీ వర్గాల నుంచి మతమార్పిడి చేసిన వారికి సౌకర్యాలు లభిస్తున్నప్పుడు, ఎస్సీలకు మాత్రమే ఎందుకు అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో దళిత క్రైస్తవులతో పాటు చర్చిలు, పాస్టర్లపై దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నిర్మించుకున్న ప్రార్థనా మందిరాలపై ఆంక్షలు, కూల్చివేతలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పోరంబోకు లేదా డి-పట్టా భూముల్లో ఉన్న చర్చిలను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ వివక్ష కొనసాగితే రాబోయే ఎన్నికల్లో దళిత క్రైస్తవులు తమ ఓటు ద్వారా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ప్రతి అవమానానికి ఓటుతోనే సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 4న జరిగే మహాధర్నా అనంతరం సచివాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఫోరం ప్రతినిధులు బందేల దయానందం, సహదేవ్, బిషప్ జ్యోతి ఆనంద్, పులిపాక ప్రకాష్, బసవన్న, దైవ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.