సాయికృష్ణ ఘటనపై పొలిటికల్ వార్
#vijayawada #andhrapradesh #politicalwar #Sai Krishna
కుమార్ చంద్ పుల్లగూర
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విజయవాడ పాత నేరస్తుడు సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ రోజుకొక మలుపు తిరుగుతుంది. మొదట కృష్ణలంక పోలీసులే అరెస్ట్ చేశారు అంటూ సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకేం తెలియదంటూ కృష్ణలంక పోలీసులు తమ వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. అయితే విజయవాడ బార్ అసోసియేషన్ ఎంట్రీతో.. సాయి కృష్ణ మిస్సింగ్ వెనుక పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేయగా.. హైకోర్టు ధర్మాసనం 15వ తేదీ లోగా సాయి కృష్ణను హాజరు పరచాలని పోలీసు శాఖకు ఆదేశించింది. అయితే 15వ తేదీన జరిగిన విచారణలో సాయి కృష్ణను పోలీసులు హాజరు పరచడంలో విఫలం అవ్వడంతో.. తిరిగి 29న హాజరు పరిచాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది.
అనూహ్య పరిణామాల నేపథ్యంలో.. వైసీపీ నేత అంబటి రాంబాబు సాయి కృష్ణను లాకెట్ చేశారంటూ ఫోటోలు, వీడియోలను విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.
సీఎం చంద్రబాబు, పవన్ లు సీరియస్..-
విజయవాడలో తాజాగా కృష్ణలంక పోలీసులపై సాయికృష్ణ అనే రౌడీ షీటర్ ను లాకప్ డెత్ చేయడమే కాకుండా అతని శవాన్ని కాల్చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు కారణమైన కృష్ణలంక పీఎస్ సీఐ నాగరాజుని వీఆర్ కు పంపింది. అయినా కాపు సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణపై ఇలా లాకప్ లో జరిగిన హత్యపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ భేటీ అయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు.. వెంటనే పోలీస్ ఉన్నతాధికారులను పిలిపించుకున్నారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. అనంతరం సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.
లాకప్ డెత్ కు కారణమైన సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తునకు సీఎం నిర్ణయించారు. సాయికృష్ణ ఘటనపై నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇక ఓ వైపు మృతునికి అండగా వైసీపీ..-
ఓవైపు మృతుడు సాయి కృష్ణ కుటుంబానికి వైసిపి అండగా నిలుస్తూ.. పలు సాక్షధారాలను, వీడియో, ఫోటో ఎవిడెన్స్ లను బయట పెట్టింది. అంతేగాక దీనికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంది. అదేవిధంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్న వైసిపి నాయకులు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు ఇప్పటికే డిసిపిని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సాయి కృష్ణ ఘటనపై వైసిపి అటు సోషల్ మీడియాలోనూ పోలీసుల తీరును ఎండ గడుతోంది.
మరోవైపు కూటమి ఎలా స్పందిస్తోందంటే..-
ఓవైపు సాయి కృష్ణ ఘటనపై వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని, ఇటు పోలీసులను విమర్శిస్తుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో కూటమికి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా చానల్స్ సాయి కృష్ణ నేర చరిత్రను బయట పెడుతూ.. ఇందులో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అంటూ పోస్టులు పెడుతున్నాయి. సాయి కృష్ణ మీద ఉన్న మొత్తం కేసులను వివరిస్తూ సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతుంది.
మొత్తంగా చూసుకుంటే.. సాయి కృష్ణ మృతి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో.. ఒక హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. నేరస్తుడ్ని అరెస్టు చేసిన వెంటనే కోర్టులో హాజరుపరచకుండా.. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా తప్పు పట్టింది. సాయి కృష్ణ మృతి విషయంలో పోలీసుల తీరును అటు న్యాయవాదులు, ఇటు హ్యూమన్ రైట్స్ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో.. సాయికృష్ణ కేసు ప్రస్తుతం ఏమలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇటీవలే పేకాట ఆడుతున్న వారిని విచారణ పేరిట రెడ్డిగూడెం పోలీసులు చిత్ర హింసలు పెట్టిన విషయం తెలిసిందే. ఇలా పోలీసులు పోలీస్ స్టేషన్ లో వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం బయట చర్చనీయాంశమైంది. ఇలాగే పోలీసుల తీరు కొనసాగితే.. ప్రజల నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయనే చెప్పాలి.