మీ రైటర్‌ని మార్చండయ్యా..!

Mar 29, 2026 - 10:27
 0  30
మీ రైటర్‌ని మార్చండయ్యా..!

ఎవరైనా ఒక స్ట్రాటజీతో వెళ్లాక ఫెయిల్యూర్ వస్తే స్ట్రాటజీని మార్చుకుంటారు. ఐపీఎల్ లో సైతం చిన్న చిన్న జూనియర్లు కూడా ఆ పని చేస్తారు. కాని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయటం లేదు. అదే స్ట్రాటజీ.. అదే స్క్రిప్ట్.. అదే గొడవ.. ఆయన మారరు.. వాళ్లు స్క్రిప్ట్ మార్చరు. ఇలా అయితే 2029కి కాదు కదా.. 2034కి కూడా పవర్‌లోకి రావడం అనేది జరగదు అనే విషయాన్ని ఆయనకు ఎవరు చెబుతారు?  అయితే 2019లో మాకు సక్సెస్ వచ్చింది కదా అంటారేమో...  ఎవరైనా ఒకసారి మోసపోతారు.. మళ్లీ మళ్లీ మోసపోరు మరి. లేకపోతే చంద్రబాబు ఫేస్ మీద సెటైర్లు ఏంటి? ఆ ఎగతాళి డైలాగులేంటి?  జగన్మోహన్ రెడ్డిగారు ముందు మీ రైటర్ ఎవరో ఆయనను మార్చండి... మీ స్ట్రాటజిస్టును మార్చండి.

ప్రత్యర్ధిని తేలిక చేసి మాట్లాడటం.. కించపర్చడం.. అబద్ధాలతో దాడి చేయడం ఇవి తప్ప ఇంకోటి చేయరా? 2019లో సక్సెస్ అయింది కదాని అదే ఇప్పుడు కూడా అమలు చేస్తే ఎలా? అసలు ఆ యాటిట్యూడ్ వల్లే కదా 2019లో అన్ని సీట్లు వచ్చినా నిలబెట్టుకోలేకపోయారు పవర్. ఎంతసేపు ప్రత్యర్ధిని టార్గెట్ చేయడం.. అణగదొక్కాలని చూడటం.. ఇదే స్ట్రాటజీ. అమరావతి ప్లాన్ కొనసాగించి.. ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడానికి కనీసం ప్రయత్నించి ఉంటే వికేంద్రీకరణ స్ట్రాటజీని జనం నమ్మేవారు. అలా చేయకుండా అమరావతిని నాశనం చేయాలని చూశారు.. అందుకే ఫలితం అనుభవిస్తున్నారు. అసలు అమరావతి పేరు పలకడానికే ఇష్టపడని నాయకుడు రాష్ట్రానికి నాయకుడు ఎలా అవుతాడు?

పవన్ కల్యాణ్ ని ఎప్పుడూ దత్తపుత్రుడు అని తప్పితే పేరు పెట్టి కూడా పిలవలేదు. పేరు పెట్టి కూడా తిట్టలేదు. కేవలం తాను ఓడిపోయాక పెట్టిన ప్రెస్ మీట్ లో మాత్రమే పవన్ కల్యాణ్ పేరు ఉచ్ఛరించాడు జగన్మోహన్ రెడ్డి. అదీ ఆయన యాటిట్యూడ్. అలాంటి యాటిట్యూడ్ రాజకీయాల్లో పనికొస్తుందా?

ఇప్పుడు అసలు కూటమి పాలనలో వేరే తప్పులే కనపడటం లేదా జగన్మోహన్ రెడ్డికి? ఎంతసేపూ వాళ్లకు ఏ మంచి పేరు వచ్చేస్తుందో దానిని అడ్డుకోవటం ఎలా అనే స్ట్రాటజీలోనే వెళుతున్నారు. అసలు కూటమి చేసిన మంచి పనులపై ఫోకస్ చేస్తే.. జనం కూడా వాటి మీదే ఫోకస్ చేస్తారు కదా. గూగుల్ డేటా సెంటర్, స్టీల్ ప్లాంట్ ఇలా వాటి మీదే మాట్లాడితే ఎలా? వాటి మీద వాళ్లు ఎలాగూ చెప్పుకుంటారు. కాని వాళ్ల ఫెయిల్యూర్స్ ఎక్కడున్నాయో చూడండి.. వాటి మీద మాట్లాడండి. ఎమ్మెల్యేల అవినీతి, ఇసుక దందాలు, మద్యం దందాలు ఇవేమీ పెద్దవి కావా? లేదా అవే పనులు తాము కూడా చేశాం కాబట్టి వాటి జోలికి వెళ్లదల్చుకోలేదా?

ఇవన్నీ ఒక ఎత్తు. అంబటి రాంబాబు ఎపిసోడ్ మరో ఎత్తు. బూతులు మాట్లాడటమే తప్పు.. మళ్లీ దానిని సమర్ధించుకోవటం.. ఎదురు దాడి చేయటం.. ఇవన్నీ ప్రజల్లో ఎలాంటి సిగ్నల్స్ ఇస్తాయి? మీ వెనక ఉన్నవారు విజిల్స్ వేస్తారేమో.. కాని ఎవరైతే మీకు ఓటు వేయలేదో వారంతా మాత్రం మిమ్మల్ని మరింత దూరం చేయడానికి మాత్రం ఇవి పనికొస్తాయి? మీకు వేసినవారే మళ్లీ వేస్తే మీరు గెలవరు కదా? ఓటు వేయనివారు కూడా మనసు మార్చుకుని ఇటు రావాలి కదా.. అప్పుడేగా మీరు గెలిచేది.. మరి ఇలాంటివి చేస్తే వస్తారా?

వైసీపీ అధినేత ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే రాజకీయంగా చాలా నష్టపోతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మారడం మారకపోవడం ఆయనిష్టం కదా.