తెలంగాణ అభివృద్ధే లక్ష్యం – శివప్రతాప్ శుక్లా
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు. ప్రజాసంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నామని, “2047 తెలంగాణ రైజింగ్” దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. తెలంగాణ పురోగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం పరిపాలనా సంస్కరణలు చేపట్టామని గవర్నర్ తెలిపారు. తెలంగాణను కోర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా విభజించి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి దారితీసినట్టు చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు GHMCని మూడు కార్పొరేషన్లుగా విభజించామని వివరించారు. ఇది స్థానిక పాలనను మరింత సమర్థవంతం చేస్తుందని అన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మూసీ నదిని 55 కిలోమీటర్ల మేర పునరుజ్జీవింప చేయనున్నట్టు గవర్నర్ ప్రకటించారు. మొదటి దశలో హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మూసీలో మురుగు నీరు చేరకుండా 39 ఎస్టీపీల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. దీని ద్వారా నది శుద్ధి, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు.
రాష్ట్ర రవాణా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఏర్పాటు చేయనున్నామని, దాని చుట్టూ MSME పార్కులు అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ORRకు అనుబంధంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వే ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో కొత్త విమానాశ్రయాలు రానున్నాయని తెలిపారు.
రైతుల సంక్షేమానికి భూభారతి చట్టం ఉపయోగపడుతోందని గవర్నర్ పేర్కొన్నారు. సన్నవడ్లు పండించే రైతులకు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. పేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, రేషన్ కార్డు దారులందరికీ సన్నబియ్యం అందిస్తున్నట్టు చెప్పారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు గవర్నర్ శివప్రతాప్ శుక్లా వెల్లడించారు.