కమలం పార్టీలో కలకలం – నిధుల గందరగోళం

#TelanganaPolitics, #BJP, #PoliticalCrisis, #FundsScam, #InternalClash, #LetterWar, #HyderabadPolitics, #BreakingNews

Apr 15, 2026 - 09:32
 0  3
కమలం పార్టీలో కలకలం – నిధుల గందరగోళం

తెలంగాణ బీజేపీలో పొలిటికల్ థ్రిల్లర్ నడుస్తోంది. అధికారమే లక్ష్యంగా అడుగులు వేయాల్సిన నేతలు.. అందినకాడికి దండుకునే పనిలో పడ్డారు. కమలం పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకత్వం.. ఒకరిపై ఒకరు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. వరుస లెటర్లతో ఢిల్లీ గల్లీల్లో పరువు బజారున పెడుతున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే కమలం పార్టీకి వచ్చిన మున్సిపల్ ఎన్నికల నిధులు ఎటు మళ్లాయి?. ఆ కోట్ల డబ్బులు ఎవరి జేబుల్లోకి చేరాయి? పిన్-టు-పిన్ ఆరా తీస్తున్న హైకమాండ్. ఈ లెక్కల చిక్కుముడి విప్పుతుందా?. లేదంటే రాష్ట్ర నేతల లేఖలతో పార్టీ విచ్ఛిన్నం కాబోతుందా?. కమలదళంలో అంతర్గతంగా జరుగుతున్న ఆ నిధుల లెక్కలేంటి?. అభయ్ పాటిల్ రిపోర్ట్ ఆధారంగా సర్జికల్ స్ట్రైక్‌ ఎటాక్ ఇవ్వబోతోంది. ఇన్‌చార్జ్ ఇచ్చిన సీక్రెట్ నివేదికలో ఎవరెవరి పేర్లున్నాయి?. ఎన్ని వికెట్లు పడబోతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం మున్సిపల్ ఫండ్స్ వ్యవహారం అగ్నిగుండంలా మారింది. ఎన్నికల ఖర్చు కోసం ఢిల్లీ నుంచి పంపిన భారీ నిధులు క్షేత్రస్థాయికి చేరకుండానే దారి మళ్లాయనే ఆరోపణలు ఇప్పుడు కమలదళాన్ని కుదిపేస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి BLసంతోష్ స్వయంగా రంగంలోకి దిగారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ నుంచి రిలీజ్ అయిన ప్రతి రూపాయికి లెక్క కావాలని హైకమాండ్ క్లారిటీ అడుగుతోంది. అభ్యర్థులకు ఎంత ఇచ్చారు?. మధ్యలో ఉన్న నేతలు ఎంత నొక్కేశారు?. అనే కోణంలో జరుగుతున్న ఈ విచారణ ఇప్పుడు నిధులు మింగేసిన నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

తెలంగాణ ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు తెలంగాణ బీజేపీలో భూకంపం సృష్టిస్తోంది. నిధుల పంపిణీలో పారదర్శకత లేదని.. కొందరు కీలక నేతలు పార్టీ పంపిన ఫండ్స్‌ సొంత అవసరాలకు వాడుకున్నారని ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. ఈ రిపోర్ట్ ఆధారంగానే హైకమాండ్ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్‌కు సిద్ధమవుతోంది. ఇన్‌ఛార్జ్ ఇచ్చిన ఈ రహస్య నివేదికలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి?. ఎవరి వికెట్ పడబోతోంది?. అనేది ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిధుల గోల్‌మాల్ కేవలం ఆర్థిక వ్యవహారంగానే మిగిలిపోలేదు. అది చివరకు కార్యకర్తల ప్రాణాల మీదకు తెస్తోంది. పార్టీ ఫండ్ వస్తుందని నమ్మి.. అప్పులు చేసి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం వెనుక ఈ నిధుల మోసమే ఉందనే చర్చ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచిన ఆ పెద్ద నేతలు ఎవరనే చర్చమొదలైంది.

అధిష్టానం ఆరా తీస్తుందని తెలిసి.. కొందరు నేతలు హడావిడిగా తప్పుడు లెక్కలు సిద్ధం చేసి సమర్పించినట్లు తెలుస్తోంది. గ్రౌండ్ లెవల్‌లో రూపాయి ఖర్చు చేయకపోయినా.. పేపర్ మీద మాత్రం లక్షల ఖర్చు చూపించి హైకమాండ్‌ను బురిడీ కొట్టించాలని చూస్తున్నారని టాక్. కానీ ఢిల్లీ పెద్దలు ఈసారి అంత సులభంగా వదిలేలా లేరు. డిజిటల్ సాక్ష్యాలు, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ప్రతి పైసాను వెరిఫై చేస్తున్నారు. ఈ ఫేక్ అకౌంట్స్ బయటపడితే ఆ నేతల రాజకీయ భవిష్యత్తు అంధకారం కానుంది.

బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పచ్చి పుండుపై కారం చల్లినట్లు ఉన్నాయి. కేంద్రం పంపిన నిధులను రాష్ట్ర నేతలు స్వాహా చేశారని పరోక్షంగా కాదు.. ప్రత్యక్షంగానే బాంబు పేల్చారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫండ్స్ గురించి కేంద్రహోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశానని చెప్పడం చర్చనీయాంశం అయింది. ఈ విచారణ సరిగా జరిగితే చాలామంది సీనియర్ నేతలు ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుందని రాజాసింగ్ చేసిన హెచ్చరిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజాసింగ్ తన లేఖలో కేవలం ఆరోపణలు మాత్రమే చేయలేదు. పూర్తి విచారణ జరిపించి పార్టీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీని అమ్మేటోళ్లు, డబ్బులు తినేవాళ్ల పీచమణచాలని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు. అభయ్ పాటిల్ లాంటి నిజాయితీ పరుల నివేదికలను హైకమాండ్ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ లేఖ ద్వారా రాజాసింగ్ ఇండైరెక్ట్‌గా రాష్ట్రంలోని ఒక పెద్ద వర్గాన్ని టార్గెట్ చేశారనేది స్పష్టమవుతోంది.

నిధుల గోల ఒకవైపుంటే.. మరోవైపు లేఖల యుద్ధం పార్టీని రోడ్డున పడేస్తోంది. ఎంపీ ధర్మపురి అర్వింద్-రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగమైంది. పార్టీలో లేఖల సంస్కృతి లేదని లక్ష్మణ్ అంటే.. లేదని తన మీద స్వయంగా లక్ష్మణే ఫిర్యాదులు చేశారని అర్వింద్ కౌంటర్ ఇవ్వడం కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోంది. సీనియర్ నాయకులు ఇలా బహిరంగ ఆరోపణలు చేసుకోవడం పార్టీ క్యాడర్‌లో తీవ్ర అసహనం కలిగిస్తోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం పని చేయాల్సిన నేతలు.. తమ ఈగోల కోసం ఆరాటపడుతున్నారు. నేనే గొప్ప. నా మాటే చెల్లాలి. అనే ఆధిపత్య పోరు తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాన్ని బీజేపీ చేజేతులా పాడు చేసుకుంటుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకరు ఢిల్లీలో చక్రం తిప్పాలని చూస్తే.. మరొకరు రాష్ట్రంలో తమ పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలను, పార్టీ ప్రయోజనాలను గాలికొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైకమాండ్ ఈసారి చాలా సీరియస్‌గా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీలోని కలుపు మొక్కలను ఏరిపారేయాలని భావిస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘించినా.. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసినా.. లైన్ క్రాస్ చేసి మాట్లాడినా.. లేఖలు రాసినా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఢిల్లీ పెద్దలు సంకేతాలు పంపారు. ఇప్పటికే కొందరు నేతల జాబితా సిద్ధమైనట్లు.. త్వరలోనే వారిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయనే వార్తలు కమలం కారిడార్లలో వినబడుతున్నాయి. నాయకులు దూషించుకుంటూంటే.. కార్యకర్తలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. గ్రామా స్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న వారికి.. నేతల మధ్య జరుగుతున్న ఈ నిధుల గోల్‌మాల్.. లేఖల యుద్ధం తీవ్ర నిరాశను మిగిల్చుతోంది. ఒకవైపు అధికార పార్టీని ఢీకొట్టాల్సిన సమయంలో.. సొంత పార్టీలోనే ఈ రచ్చ ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కలు తేలకపోతే.. లేఖలు ఆగకపోతే.. తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం కష్టమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ బీజేపీ ఇప్పుడు క్లిష్టమైన మలుపులో ఉంది. ఢిల్లీ నుంచి వచ్చే నిధులు అభ్యర్థుల చేతికి చేరుతున్నాయా?. లేక మధ్యలోనే హారతి కర్పూరంలా ఆరిపోతున్నాయా తేలాల్సిన సమయం వచ్చింది. అటు రాజాసింగ్ లేఖలు.. ఇటు అర్వింద్ ఆరోపణలు.. మధ్యలో లక్ష్మణ్ సంజాయిషీలు. ఈ రాజకీయ రొంపిలో అసలు దోషులెవరో హైకమాండ్ తేల్చాల్సి ఉంది. నిధుల లెక్కలు సరిచేసి.. లేఖల మంటలు చల్లార్చకపోతే.. తెలంగాణలో అధికార కల నెరవేరడం కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. మరి బీజేపీ అధిష్టానం చేసే ఆపరేషన్ క్లీన్‌లో ఎవరి వికెట్లు పడతాయి?. ఎవరికి షాక్ తగులుతుంది?. తెలియాలంటే వెయిట్ అండ్ వాచ్.