ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో అవకతవకలపై విచారణకు డిమాండ్
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరవుతున్న రుణాలు, వాహన సబ్సిడీ రుణాలలో జరుగుతున్న అవకతవకలు, అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే విధంగా చూడాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతంను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం అజయ్ కుమార్, బోగం విష్ణులతో కలిసి వారు మాట్లాడుతూ.. రుణాల మంజూరులో అర్హత కలిగిన ఎస్సీ నిరుద్యోగ యువతకు కాకుండా రాజకీయ పలుకుబడి, ఆర్ధికవృద్ధి ఉన్న వారికి అధికారులు రుణాలను మంజూరు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రుణాలు మంజురు చేయించేందుకు దళారులు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇచ్చిన వారికే రుణాలు మంజూరవుతున్నాయే తప్ప అర్హులైన వారికి అందడం లేదని వారు పేర్కొన్నారు. సబ్సిడీ లోన్స్ ద్వారా వాహనాల కొనుగోలులో బోగస్ కోటేషన్లు, నకిలీ బిల్లులు, అక్రమ లావాదేవీలు జరుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వారు తెలిపారు. ఎంపికైన లబ్దిదారులు పూర్తి జాబితా, ఎంపిక ప్రక్రీయ, మంజూరైన రుణాల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండటకపోవడంతో దరఖాస్తు చేసుకున్న యువత ఆందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అనర్హులకు వెళ్లుతుండటంతో ప్రభుత్వ లక్ష్యం నేరవేరక ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంటుందన్నారు.