పవన్ వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందా..!

#PawanKalyan, #JanaSena, #AndhraPolitics, #NorthAndhra, #APPolitics

Apr 3, 2026 - 20:18
Apr 3, 2026 - 20:18
 0  4
పవన్ వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందా..!

ఎవరు అవునన్నా.. కాదన్నా జనసేన కాపుల ఆధిపత్య పార్టీ. ఉమ్మడి గోదావరి జిల్లాలను దాటి కమ్మ, రెడ్డి కులాల ఆధిపత్యం గల జిల్లాల్లో సక్సెస్ కాదు. అందుకే పవన్ ఈసారి ఆ జిల్లాల్లో బలపడటానికి 'రూట్ ప్లాన్' లో ప్రాధాన్యత ఇస్తారు. గడచిన ఎన్నికల్లో ఒక ప్రత్యేక లక్ష్యం కోసం రాజీపడ్డారు. కానీ, ఈసారి కచ్చితంగా రెట్టింపు సీట్లనే అడిగే అవకాశం ఉంది. కమ్మ, రెడ్డి ప్రాంతాల్లో క్యాడర్ సంతృప్తికి అరకొరా అడిగినా సంఖ్యా బలం పెరగడానికి ఉత్తరాంధ్ర తప్ప మరో ప్రాంతం లేదు. తూర్పు కాపులు, గిరిజన ప్రాంతాలు, కుల, మత, స్థానికతకు ప్రాధాన్యత లేని విశాఖ అర్బన్ జిల్లా మాత్రమే ఆయనకు అనుకూలం. గత ఎన్నికల్లో గెలిచిన 21 మందిలో ఆరుగురు కళింగాంధ్రులు. శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి జిల్లాల్లో మాత్రమే ప్రాతినిధ్యం లేదు. 

కొన్ని నెలల నుంచి విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు చేయడం గమనిస్తే, ఉత్తరాంధ్ర పైనే పవన్ ఎక్కువ ఫోకస్ పెట్టారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అరకు ఏజెన్సీలో తరచూ పర్యటిస్తూ, అక్కడి గిరిజనులతో మమేకం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేతిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం. అటవీ, సైన్స్, టెక్నాలజీ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ఆ అవకాశంతోనే 'అడవి బాట' పేరుతో అరకు ఏజెన్సీలో పర్యటించి, వెయ్యి కోట్ల అంచనా తో 652 గ్రామాలకు రోడ్డు వేసే పథకానికి శ్రీకారం చుట్టారు. అరకు ఎంపీ, అరకు, పాడేరు ఎమ్మెల్యే సీట్లు వైసీపీ చేతిలో ఉన్నాయి.

వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లను తమకు కేటాయించాలని కోరితే చంద్రబాబుకు కూడా ఇబ్బంది ఉండదు. ఇప్పటికే అరకు ఎంపీ పరిధిలోని పాలకొండ జనసేన ఖాతాలో ఉంది. ఇది ఎస్టీ నియోజకవర్గమైనా తూర్పు కాపుల ఆధిక్యత ఎక్కువ. మరో ఎస్టీ నియోజకవర్గం కురుపాం కూడా ఈసారి అడిగే అవకాశం ఉంది. అక్కడ పార్టీ సంస్థాగతంగా బలంగా లేకపోయినా గత కొన్ని నెలల నుంచి జనసేన కార్యకర్తలకు ఎక్కువ నామినేట్ పోస్టులు ఆ నియోజకవర్గంలో ఇచ్చారు. సిటింగ్ టీడీపీ ఎమ్మెల్యే పై కూడా చాలా విమర్శలు ఉన్నాయి. అందువల్ల ఈ సీటును కూడా జనసేనకు కేటాయించడానికి చంద్రబాబుకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు.

2019లో ఓడిపోయిన సుందరపు విజయ్ కుమార్, లోకం నాగ మాధవికి మరో అవకాశం ఇచ్చారు. గతంలో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆవేదనతో విశాఖ జిల్లాలో కొత్తగా ఒక సీటు కేటాయించాలని పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రాతినిధ్యం లేని శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం డిమాండ్ చేస్తారని కొన్ని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఆ నియోజకవర్గానికి చెందిన కొరికాన రవికుమార్‌కు ఎంతో కీలకమైన 'సుడా' చైర్మన్ పదవి ఇవ్వడం గమనించవలసిన అంశం. రవికుమార్ స్వస్థలం పాతపట్నమైనప్పటికీ.. వ్యాపార లావాదేవీలు పాండిచ్చేరిలో! అయితే, గడిచిన ఎన్నికల్లో పాలకొండ అభ్యర్థి గెలుపు కోసం రవికుమార్  అన్ని విధాల బాధ్యత తీసుకున్నారని, ఆయన ఆర్థిక పరిస్థితి కూడా అనువుగా ఉంటుందనే అభిప్రాయం పవన్‌కు ఉన్నట్టు ఒక ప్రచారం. 

2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన గేదెల చైతన్యకు ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చారు. హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జనసేనకు చెందిన మామిడి రామకృష్ణారావును నామినేట్ చేయించడంలో రవికుమార్ పాత్ర ఉంది. రానున్న ఎన్నికల్లో రవికుమార్ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. టీడీపీలో రెండు ప్రధానమైన గ్రూపు తగాదాలు కూడా ఆ పార్టీకి తలనొప్పిగా ఉన్నాయి. అందువల్ల పాతపట్నం కూడా జనసేనకు కేటాయించడానికి చంద్రబాబుకు అభ్యంతరం లేకపోవచ్చు. అక్కడ కూడా తూర్పు కాపుల ఆధిపత్యం ఉంది. గిరిజనులు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఇక, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో నాగబాబు ప్రత్యేక పర్యటనలు చేయడం వల్ల ఆ సీటును కూడా జనసేన డిమాండ్ చేయవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. 

సిట్టింగ్ ఎమ్మెల్యే పై విమర్శలు, టీడీపీలోని ఒక ఎమ్మెల్యేతో ఉన్న విభేదాలు, కులపరంగా మైనార్టీ కావడం ఆయనకు మైనస్‌గా మారవచ్చు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూడా తూర్పు కాపులు అధిపత్యం ఉన్నా.. ఓసీ కాపులుగా గోదావరి జిల్లాల్లో భావిస్తున్న తెలగ సామాజిక వర్గం సంఖ్య కూడా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. నాగబాబు ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. అయితే, ఈనాటికి కూడా జనసేన పార్టీ సంస్థాగతంగా కళింగాంధ్రలో బలంగా లేదు. పూర్తిస్థాయి జిల్లా, మండల, నియోజకవర్గ కమిటీలు కూడా లేవు. గత ఎన్నికల్లో దక్కిన విజయాల వెనుక టీడీపీ క్యాడర్ మనస్పూర్తిగా పనిచేయడమే! జగన్ వ్యతిరేక వేవ్ లేదా కొందరు మేధావులు చెబుతున్నట్టుగా, పెరిగిన సాంకేతిక ఓటింగ్ ఈ విజయాల వెనుక పాత్ర పోషించిందేమో! అయితే, ఈసారి ఎన్నికలు ఏకవక్షంగా జరగవన్న సంగతి, ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత సూచిస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాలి. ఏది ఏమైనా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ క్రమంగా పెరుగుతుందన్న మాట మాత్రం వాస్తవం.