కేంద్ర కేబినెట్ విస్తరణలో జనసేనకు ఛాన్స్?..
#narendramodi #pawankalyan #politics #delhi
దేశ రాజకీయాల్లో మరోసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే కేంద్ర కేబినెట్‌ను విస్తరించనున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో భాగస్వామ్య పార్టీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి కేంద్ర కేబినెట్‌లో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఎన్డీఏ ఏర్పడినప్పుడే జనసేనకు అవకాశం
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సమయంలోనే జనసేనకు కేంద్ర సహాయ మంత్రి పదవి కేటాయించినట్లు అప్పట్లో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు తొందరపడలేదని సమాచారం. కొంతకాలం తర్వాతే మంత్రివర్గంలో చేరుతామని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రధాని మోదీకి తెలిపినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ వెళ్లిన సందర్భంగా కూడా కేంద్ర కేబినెట్ విస్తరణ అంశంపై చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈసారి విస్తరణలో జనసేనకు మంత్రి పదవి దాదాపు ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరికి దక్కనుంది మంత్రి పదవి?
ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ ఏమిటంటే… జనసేన తరఫున కేంద్ర కేబినెట్‌లో ఎవరికీ అవకాశం దక్కనుందన్నదే. ప్రస్తుతం జనసేనకు లోక్‌సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం నుంచి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి విజయం సాధించారు.
బాలశౌరి ఇప్పటికే అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. గతంలో ఇతర పార్టీల్లో పనిచేసిన ఆయన ఎన్నికలకు ముందు జనసేనలో చేరి విజయం సాధించారు. మరోవైపు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రాజకీయాల్లో కొత్త ముఖం. తక్కువ కాలంలోనే జనసేన టికెట్‌తో ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌కు చేరుకున్నారు. దీంతో అనుభవానికి పెద్దపీట వేస్తారా? లేక యువత, కొత్త నాయకత్వానికి అవకాశం ఇస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పవన్ కళ్యాణ్ ఆలోచనలు భిన్నమేనా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలు సాధారణ రాజకీయ సమీకరణాలకు భిన్నంగా ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం అనుభవం, కుల సమీకరణాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత నిష్ఠ, ప్రజలతో అనుబంధం, అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిత్వం వంటి అంశాలను కూడా పవన్ ప్రాధాన్యంగా పరిగణిస్తారని అంటున్నారు.
ఇద్దరు ఎంపీలూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారే కావడం, పార్టీ కోసం చాలా కాలంగా కష్టపడిన నేతలు కాకపోవడం కూడా మరో చర్చకు దారితీస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ పూర్తిగా కొత్త వ్యూహంతో ముందుకెళ్తారా? లేక ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో ఒకరికి అవకాశం కల్పిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
కేంద్ర కేబినెట్‌లో జనసేనకు ప్రాతినిధ్యం లభిస్తే అది కేవలం పార్టీకి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన, ఇప్పుడు కేంద్ర స్థాయిలో కూడా తన ప్రాధాన్యతను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పుడంతా ఒకటే ప్రశ్న అడుగుతున్నారు… ఢిల్లీలో జనసేన జెండా ఎగరేసే అదృష్టవంతుడు ఎవరు? పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారు? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.