హైడ్రా చర్యలపై ప్రణీత్ ఆంటీలియా వాసుల నిరసన
ప్రణీత్ ఆంటీలియాలో ఉద్రిక్తత…హైడ్రా కూల్చిన ప్రహరీ గోడ
కుత్బుల్లాపూర్, మార్చ్ 9: బాచుపల్లి ప్రాంతంలో ఉన్న ప్రణీత్ ఆంటీలియా గ్రేటెడ్ కమ్యూనిటీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో నివసిస్తూ క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్న తమ కమ్యూనిటీ ప్రహరీ గోడను ఈరోజు హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేయడం బాధాకరమని కాలనీవాసులు తెలిపారు. కమ్యూనిటీ లోపల నుంచి ORR ఎగ్జిట్–4 వరకు దారి ఏర్పాటు చేయాల్సి ఉందని చెబుతూ హైడ్రా అధికారులు ప్రహరీ గోడను కూల్చివేశారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై శనివారం రోజున హైడ్రా అధికారులు కమ్యూనిటీ వాసులకు నోటీసులు అందజేసినట్లు వారు తెలిపారు.
అయితే నోటీసులకు స్పందిస్తూ తాము లాయర్ ద్వారా హైడ్రా అధికారులకు రిప్లై ఇచ్చేలోపే, ఈరోజు ఉదయం హైడ్రా అధికారులు వచ్చి ప్రహరీ గోడను కూల్చివేశారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రణీత్ ఆంటీలియా గ్రేటెడ్ కమ్యూనిటీ వాసులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ముందస్తు చర్చలు లేకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదని, తమ సమస్యకు అధికారులు తక్షణ పరిష్కారం చూపాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మరియు కాలనీవాసుల మధ్య ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో చూడాల్సి ఉంది.భారీ సంఖ్యలో హైడ్రా అధికారులు మరియు పోలీసులను మొహరించారు.