సర్వే సంస్థల నిజాయితీ ఎంత..?

#BJP #TVK #westbengal #tamilnadu #survey

May 4, 2026 - 20:38
 0  6
సర్వే సంస్థల నిజాయితీ ఎంత..?

ఎంత గోల చేశాయి.. ఎన్ని చెప్పాయి.. సర్వే సంస్థలు, స్ట్రాటజీ సంస్థలు. అంతా వడపోసి అసలు విషయం పట్టేసినట్లు.. అంతా పసిగట్టేసినట్లు ఏమి ఫోజులు పెడతారు కదా. కాని వీరు కూడా జనం లాగే .. కొందరు మేదావులలాగే గాలి చూసి వాటాన్ని ఊహించి.. ఫలితాలు అంచనాలు వేసేసి అవే మనకు సర్వే రిపోర్టుల్లా ఇచ్చేస్తున్నారని ఈసారి మరింత స్పష్టంగా అర్ధమైంది. ఇప్పుడు ఫలితాలు చూశాక కూడా తాము చాలా దగ్గరిగా ఇచ్చామని కూడా అబద్ధాలు చెప్పేస్తూ మనలను నమ్మేయమంటున్నారు. 

ఫస్ట్ తమిళనాడు చూద్దాం. డీఎంకె స్టాలిన్ మరోసారి సీఎం అవుతారని.. విజయ్ పాత్ర కేవలం 10 నుంచి 20 సీట్లకే పరిమితమని చెప్పేశాయి సదరు సంస్థలు. దీంతో డీఎంకె వద్దనుకున్న జనం కూడా .. విజయ్ సీఎం అవడు కదా అని అన్నాడీఎంకెకు వేసిన సీట్లు కూడా ఇప్పుడు కనపడుతున్నాయి. అదే సర్వే సరిగ్గా చేసి చెప్పుంటే విజయ్ ఈ రోజు మరో 8, 10 సీట్ల కోసం ఎదురుచూసేవాడు కాదు. గ్యారంటీగా మెజారిటీ తెచ్చుకునేవాడు. ఆషామాషీ సర్వేల వల్ల జరిగిన నష్టమిది. ఎగ్జిట్ పోల్స్ లోనూ అదే పాట పాడారు. కాని ఓ మాజీ ఐపీఎస్ 2,34,000 శాంపిల్స్ సేకరించి మరీ చెప్పాడు విజయ్ అధికారంలోకి వస్తున్నాడని.. అయినా చాలామంది నమ్మలేకపోయారు. ఇన్ని సర్వే సంస్థలు రాడని చెబుతుంటే వీళ్లు అలాగే యాక్సిస్ మై సర్వే ప్రదీప్ గుప్తా మాత్రమే చెబితే ఎలా నమ్మాలి అన్నట్లు చూశారు. నేడు ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోవడమే కాదు.. పశ్చాత్తాపపడుతున్నారు కూడా.

అలాగే బెంగాల్ తీసుకోండి. సర్వేలు జరిగినన్నాళ్లు మళ్లీ మమతాబెనర్జీయే సీఎం అన్నారు. అసలు ఒకవపు 90 లక్షల ఓట్లు తీసేశారు.. అవి కూడా మమతకు పడే ఓట్లేనని.. కాబట్టి బిజెపి గెలుస్తుందని ఎవరు చెప్పినా పట్టించుకోలేదు. పైగా మూడుసార్లు గెలిచి వ్యతిరేకత పెంచుకున్న మమత ఓడిపోకుండా ఎలా ఉంటుంది? బలమైన ప్రత్యర్ధి లేకపోతే అనుకోవచ్చు.. తన వ్యూహ ప్రతివ్యూహాలతో కమలమేఘాలు కమ్మేస్తున్నా కూడా సర్వేలు మాత్రం మమతాయే గెలుస్తుందని.. బెంగాల్ లో ట్రెడిషనల్ గా ఉన్న ఓటింగ్ బిజెపికి రాదని చెప్పాయి. ట్రెడిషనల్ గా వచ్చే ఓట్లులో వలసదారులున్నారని.. వారి ఓట్లు ఇప్పుడ లేవన్న సంగతి కూడా పట్టించుకోలేదు. వీటి వల్ల సీట్లు మమతకు తగ్గొచ్చు గాని.. పవర్ ఆమెదే అన్నారు. ఎగ్జిట్ పోల్స్ జరగగానే ప్లేటు ఫిరాయించారు... మమత ఓడిపోతుంది.. బిజెపి గెలుస్తుందని చెప్పేశారు. అది కూడా మోదీ కాన్ఫిడెన్స్, అమిత్ షా ధీమా చూశాకే మార్చారని చెప్పాలి.

కేరళలో ఎల్డీఎప్ ఓడిపోతుందన్నారు గాని పోటా పోటీ అన్నారు.. కాని యూడీఎఫ్ ఎన్నడూ లేని విధంగా అధిక సీట్లతో గెలిచింది. ఇలా అన్ని అంచనాలు ఊహాగానాలు మాత్రమేనా... వీళ్లు అసలు సర్వే సైంటిఫిక్ గా చేయటం లేదా అనే అనుమానం వస్తుంది. అసలు సర్వే శాంపిల్స్ తో చేస్తేనే సరైన అంచనా రావడం కష్టం. అలాంటిది అది కూడా చేయకుండా జస్ట్ మీడియా, సోషల్ మీడియా తిరగేసి సర్వే రిపోర్టులు తయారు చేసే బాపతు వచ్చేశాక.. వీటిని నమ్మాలని ఎలా అనుకుంటారు?

అసలే రాజకీయ పార్టీలు మీడియాను మేనేజ్ చేస్తున్నాయి. మీడియా కూడా దానికి తగ్గట్టుగా డ్యాన్స్ వేస్తుంది. అలాగే పార్టీల సోషల్ మీడియా బ్యాచులు కూడా దీనిని మరింత పెంచుతాయి. ఇవన్నీ చూసేసి సర్వే సంస్థలు అంచనాలు కట్టేసి రిపోర్టులు ఇచ్చేస్తే.. ఆ రిపోర్టులు ఇలాగే ఉంటాయి. అందుకే దయ చేసి సర్వే సంస్ధలు శాంపిల్స్ సేకరించి సైంటిఫిక్ గా సర్వే చేయండి.. దానికి తగ్గట్టు యంత్రాంగం పెట్టుకోండి.. అంతే గాని తూతూమంత్రంగా చేసేయకండి. ఇంకో ప్రమాదకర ట్రెండింగ్ ఏంటంటే... ఈ సర్వే సంస్థలపై ఆధారపడి బెట్టింగ్ వ్యవహారం నడవడం.