అశ్వారావుపేటలో పెద్దపులి కలకలం.. అప్రమత్తమైన అటవీశాఖ
#తెలంగాణ #అశ్వారావుపేట #పెద్దపులి #tiger #భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామ సమీపంలో రైతు భీమరాజుకు చెందిన ఎద్దుపై పులి దాడి చేసి చంపడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి అడుగుజాడలను గుర్తించి, దాని మెడలో అమర్చిన రేడియో కాలర్ నుంచి వస్తున్న సిగ్నల్స్ ఆధారంగా కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో అడవివైపు వెళ్లవద్దని అధికారులు సూచించారు. పశువులను ఒంటరిగా మేపేందుకు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. పులి కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు.