ఇక ఆ రైల్వేస్టేషన్లు కూడా మనకే..!

#Srikakulam #RailwayZone #SouthCoastalRailway #APNews #NorthAndhra #RailwayUpdates

Apr 3, 2026 - 20:30
 0  3
ఇక ఆ రైల్వేస్టేషన్లు కూడా మనకే..!

పోరాటం ఫలించింది. శ్రీకాకుళం జిల్లా వాసుల మొరను ఎట్టకేలకు రైల్వేబోర్డు ఆలకించింది. విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకే మొత్తం శ్రీకాకుళం జిల్లాను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మార్పులు చేయాలని ఆదేశిస్తూ రైల్వేశాఖ నుంచి దక్షిణ కోస్తా, తూర్పుకోస్తా రైల్వే జోన్లకు ఉత్తర్వులు అందాయి. శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న రైల్వేస్టేషన్లు, లైన్లను తూర్పుకోస్తా జోన్‌లోనే కొనసాగించాలని ఇంతకుముందు నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీకాకుళం జిల్లా మళ్లీ పరాయి జోన్‌లోనే ఉండిపోతున్నదని, దీనివల్ల అభివృద్ధిలో వెనుకబడిపోతుందని రాజకీయ విశ్లేషకులు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. 

దీంతో అప్రమత్తమైన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్రం స్థాయిలో ప్రయత్నించి జిల్లాకు అన్యాయం జరగకుండా అడ్డుకున్నారు. రైల్వేబోర్టు ఉన్నతాధికారులతో పాటు రైల్వేశాఖ మంత్రి ఆశ్వినీ వైష్ణవ్‌తో సంప్రదింపులు జరిపి వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను ముక్కలు చేసి రెండు రైల్వేజోన్లలో చేర్చడం వల్ల మరింత వెనుకబడిపోతుందని, రాష్ట్రంలో రైల్వేపరంగా అభివృద్ధిలో అసమానతలు చోటు చేసుకుంటాయని వివరించారు. ఆయన కృషికి వెంటనే ఫలితం లభించింది. శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న ఏడు రైల్వేస్టేషన్లు కూడా కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణా కోస్తా రైల్వేజోన్‌లో చేర్చాలని రెండు జోన్ల అధికారులను ఆదేశించింది. 

ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం 2019లో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా పేరుతో కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు దక్షిణ మధ్య రైల్వే, తూర్పుకోస్తా రైల్వే జోన్ల పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైల్వేస్టేషన్లు, లైన్లను  ఒక రాష్ట్రం - ఒక జోన్ ప్రాతిపదికన ఏపీకి ప్రత్యేకించిన కొత్త జోన్‌లోనే చేర్చాలని నిర్ణయించారు. ఆ మేరకు ఫిబ్రవరి చివరి వారంలో రైల్వే మార్గాలను విభజించి జోన్‌ల హద్దులను ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం తూర్పు కోస్తా జోన్‌లో వాల్తేర్, ఖుర్దా డివిజన్లుగా ఉన్న ప్రాంతాల వర్గీకరణలో రైల్వే బోర్డు ఒడిశా ఒత్తిళ్లకు లొంగిపోయి వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. వాటికి తగినట్లే వాల్తేర్ డివిజన్ పరిధిలో అరకు తదితర పర్యాటక ప్రాంతాలు, సరుకు రవాణా మార్గాలు  కలిగిన కేకే లైన్‌ను తూర్పుకోస్తా పరిధిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాయగడ డివిజన్‌లో విలీనం చేయడం, తూర్పుకోస్తా జోన్ పరిధిలోని  ఖుర్దా డివిజన్‌లో గతం నుంచీ కొనసాగుతున్న పలాస - ఇచ్ఛాపురం మధ్య స్టేషన్లను కొత్త జోన్‌లో చేర్చకుండా అలాగే కొనసాగించడం రాష్ట్ర వాసుల్లో అసంతృప్తి రేపింది. 

ఈ అంశాలను వైసీపీ నేతలు ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో రంగంలోకి దిగిన రాము చేసిన ప్రయత్నాలు ఫలించి శ్రీకాకుళం జిల్లాలోని ప్రాంతాలు ఒడిశా నుంచి విముక్తి పొంది విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా జోన్‌లో చేరాయి. గతంలో పలాస ముందు వరకు దక్షిణ కోస్తాలో చేర్చిన అధికారులు తాజా ఉత్తర్వుల ప్రకారం పలాస స్టేషన్  మొదలుకొని సుమ్మాదేవి, మందస రోడ్డు, బారువ, సోంపేట, జాడుపూడి, ఇచ్ఛాపురం కలుపుకొని మొత్తం ఏడు రైల్వేస్టేషన్లను కొత్త జోన్‌లో చేర్చడానికి మార్గం సుగమమైంది. రైల్వేబోర్డు నిర్ణయంపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన విశాఖ రైల్వే జోన్ కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2019లో తమ ఎన్డీయే ప్రభుత్వమే ఈ జోన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ కొత్త జోన్‌లో చేరిక విషయంలో శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరగకుండా కూడా నివారించగలిగామని ఇందుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు మంత్రి రామ్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు.