కొత్త ప్రభుత్వం రూల్స్ మార్చలేకపోతుందా?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నీ మాట్లాడతారు. కాని అధికారంలోకి వచ్చాక కొన్నే గుర్తుంటాయి.. ఎందుకో మరి తెలియదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నీ మార్చేయాలంటారు.. అధికారంలోకి వచ్చాక వ్యవస్ధ, రూల్స్, సమస్యలు గుర్తొస్తాయి. అంటే అప్పుడు అధికారంలో ఉన్నవారిని తప్పుబట్టడం కోసమే అవి మాట్లాడతారా... లేక వీరు అధికారంలోకి రావడమే లక్ష్యంగా అవన్నీ చేస్తారా..? అవే డౌట్స్ వస్తుంటాయి మనకి ఎప్పుడూ. ఎందుకంటే ఇలాగే జరుగుతుంటాయి ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిపోవస్తుంది. కాని కొన్ని విషయాలు ఎందుకో అంతగా పట్టించుకోవడం లేదా.. పట్టించుకోనట్లు నటిస్తున్నారా అర్ధం కావడం లేదనే కామెంట్లు వస్తున్నాయి.
లేటెస్టుగా మార్కాపురం దగ్గర హరికృష్నారెడ్డి అనే వ్యక్తి హరికృష్ణ ట్రావెల్స్ పేరుతో బస్సులు నడుపుతున్నాడని తెలిసింది. ఆ బస్సు యాక్సిడెంటుకి గురై 14 మంది చనిపోయాకే ఆ విషయం ఎక్కువమందికి తెలిసింది. సెకండ్ హ్యాండ్ బస్సులు కొనుక్కుని వాటిని అరుణాచల్ ప్రేదశ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుని.. నడిపేస్తున్నాడు. డ్రైవింగ్ కూడా వాడే చేశాడంటే వాడి పరిస్ధితి ఏంటో అర్ధమవుతుందిగా.. అయినా వాడికి ట్రావెల్స్ నడిపే అవకాశం ఇచ్చింది మన రవాణా శాఖ. అంటే మేనేజ్ చేస్తే ఎవడికైనా ఏమైనా ఇచ్చేస్తారా.. వాటి వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నా మారరా.. మార్చుకోరా అని జనం అడుగుతున్నారు. చనిపోయినవారి కుటుంబానికి పరిహారం ఇస్తామంటే..ఆ డబ్బులేవో పెట్టి మంచి బస్సులు వేయండి సామీ అంటూ బాధితులు మొక్కుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు వాళ్ల ఆవేధన, వారి ఆవేశం.
అసలు ప్రైవేటు ట్రావెల్స్ సమస్య ఈనాటిది కాదు. ట్రావెల్స్ ఓనర్లు రాజకీయ నేతలు అయ్యారు.. రాజకీయ నేతలే ట్రావెల్స్ ఓనర్లు అయ్యారు. అప్పటి నుంచి పాలసీలు వాళ్లకు అనుగుణంగా చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడో ఎన్టీఆర్ రూట్స్ నేషనలైజ్ చేశారు గాని.. తర్వాత మాత్రం అవే బస్సులను బూరిజం బస్సుల్లా మార్చి మళ్లీ రంగంలోకి దింపారు. అప్పట నుంచి అవి కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని ఆపేయండి మహాప్రభూ అని ఆర్టీసీ కార్మికులంతా కోరినా... చేయలేదు. అదేమంటే అవన్నీ ఆపేసి.. ఇంతమంది జనాన్ని తిప్పడానికి మన ఆర్టీసి సరిపోతుందా అని ఎదురు ప్రశ్నిస్తారు. కాని వాటి మీద మానిటరింగ్ లేక ఎన్నిసార్లు యాక్సిడెంట్లు అయ్యాయో.. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు. యాక్సిడెంట్ అయిన కొన్ని రోజులు కేసులు, విచారణలు అంటూ హడావుడి. తర్వాత అవన్నీ సైలెంటుగా తెర వెనక సెటిల్ అయిపోతుంటాయనే విషయం కూడా అందరికీ తెలుసు.
సరే వాటిని బ్యాన్ చేయకపోతే చేయకపోయారు.. కనీసం కంట్రోల్ చేయొచ్చు కదా అంటే.. అదీ చేయరు. కొన్నేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అక్కడ ఏవైనా నడిచిపోతాయి.. ఈ హరికృష్ణ ట్రావెల్స్ లాగానే ఫిట్ నెస్ లేకపోయినా ఓకె చేసేస్తారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి కదాని మనోళ్లు వదిలేస్తారు. కాని ఒకే నెంబర్ మీద రెండు మూడు బస్సులు కూడా తిప్పుతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అయినా మనోళ్లకు తెలిసీ తెలియనట్లు వదిలేస్తుంటారు.
అసలు బస్సులు మన రాష్ట్రంలోనే రిజిస్టర్ చేసుకోవాలని ఎందుకు కండిషన్ పెట్టరు? అలా అని ఓ జీవో తెస్తే అందరూ కంట్రోల్ లోకి వస్తారు కదా. పైగా మనకు ఆదాయం కూడా వస్తుంది కదా. అయినా ఆ పని ఎందుకు చేయటం లేదు? ఎందుకు ఆ ప్రైవేటు ట్రావెల్స్ అన్నిటిని అలా గాలికి వదిలేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి తనిఖీలు అని ఫైన్ వేసి వదిలేస్తుంటారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. రూల్స్ మార్చాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు.