ఓ టీడీపీ కార్యకర్త దీనగాధ
#TDP #NTR District
సమాజానికి మంచి చేయాలన్న ఓ వ్యక్తి తపన.. తన పాలిట శాపంగా మారింది. పార్టీపై తనకున్న అచంచలమైన విశ్వాసం చివరికి తనను నట్టేట మునిగేందుకు సిద్ధం చేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలోనికి చేరిన వైనం చూపరులను కన్నీరు పెట్టించేలా చేస్తోంది. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఏంటి ఆయన చేసిన మంచి పని.. దాని ఫలితంగా ఆయన ఎదుర్కొంటున్న సమస్యలేంటి అన్న విషయాలను మీ ముందుకు తెస్తోంది.. పాయింట్ మీడియా.. వివరాల్లోనికి వెళితే.. ఆయన పేరు బడే మదన్.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎన్నో ఏళ్ళుగా సేవలందిస్తున్నాడు. పార్టీ ఏదైతే సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అన్న స్లోగన్ ను ముందుకు తీసుకువచ్చిందో.. దానినే నమ్ముకుని గ్రామానికి మంచి చేయజూసాడు. రూ.70 లక్షలు ఖర్చు చేసి అప్పుల్లో మునిగిపోయాడు. ఇంతకీ.. ఎవరు బడే మదన్ ఇబ్బందులు ఎదుర్కోవటానికి ముఖ్య కారణం.
బడే మదన్.. ఎన్టీఆర్ జిల్లాలోని షేర్ మొహమ్మద్ పేటలో నివసించే ఓ సాదాసీదా వ్యక్తి.. ఈయనకు తొలినాళ్ళ నుంచీ తెలుగుదేశం పార్టీ అంటే వల్లమాలిన ప్రేమాభినాలు ఉండేవి. అయితే సమాజానికి మంచి చేయాలన్న సంకల్పం ఉన్న బడే మదన్... తన ఆలోచనను అమలు పరచే దిశగా ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయమే.. గ్రామంలోని చెరువును అభివృద్ధి చేయటం. అనుకున్నదే తడవుగా ఓ కార్యాచరణకు నడుం బిగించాడు. ప్రభుత్వం అందించే నీరు- చెట్టు పథకం కింద వచ్చే నిధులను ఉపయోగించుకుని తన గ్రామంలోని చెరువును అభివృద్ధి చేయాలని అడుగులు ముందుకు వేశాడు. అందులోభాగంగానే.. 2016 నుండి 2018 వరకు ‘నీరు చెట్టు’ పథకం కింద గ్రామంలోని చెరువు అభివృద్ధి పనులను స్వయంగా చేపట్టి, సుమారు 150 ఎకరాల పరిధిలో పనులు పూర్తి చేయడానికి ఆయన తన సొంత డబ్బులతోనే దాదాపు రూ.70 లక్షలు ఖర్చు పెట్టాడు.
అయితే.. డామిట్.. కథ అడ్డం తిరిగింది. బడే మదన్ ఖర్చు చేసిన డబ్బుకు న్యాయం జరుగకపోగా.. తాను చేయించిన పనుల తాలూకూ డబ్బులను కూడా అధికారులు విడుదల చేయలేదు. సాక్ష్యాత్తు ఎమ్మెల్యే సైతం తన పార్టీ కార్యకర్త చేసిన పనిని జీర్ణించుకోలేక.. ఆ పనులకు విడుదల చేయాల్సిన డబ్బును నిర్లక్ష్యం చేసి పక్కను పెట్టేసారు. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన బడే మదన్ పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ,పార్టీ కోసం తన జీవితాన్ని అర్పించిన ఈ కార్యకర్తను ఇప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వంపై, నాయకులపై నమ్మకంతో ముందుకు వచ్చిన ఆయనకు ఇప్పుడు ఆ నమ్మకం మోసం చేసినట్టుగా మారింది. పనులు పూర్తయ్యాక కూడా ఒక్క రూపాయి చెల్లింపు చేయకపోవడం, పైగా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల బడే మదన్ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయారు. కుటుంబ పరిస్థితి దారుణంగా మారిందని, జీవనోపాధి సంక్షోభంలో పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద నష్టం జరిగినప్పటికీ, స్థానిక ఎమ్మెల్యేను పలుమార్లు కలిసినా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో బడే మదన్ వాపోతున్నాడు. పార్టీ కోసం తన జీవితాన్ని అర్పించానని,, గ్రామ అభివృద్ధి కోసం తన డబ్బు ఖర్చు పెట్టానని.. కానీ ఇప్పుడు తనను ఎవరూ గుర్తించట్లేదని ఇది న్యాయమా ? అంటూ మదన్ ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నాడు. ప్రభుత్వ పథకాలు అమలు పేరిట కార్యకర్తలను ఉపయోగించుకుని, తరువాత వదిలేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో తలెత్తుతున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, బడే మదన్‌కు న్యాయం చేయకపోతే పెద్ద స్థాయిలో ఆందోళనలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.