అచ్చెన్నాయుడు స్థానం లో కొత్త మంత్రి..

#TDP, #SrikakulamPolitics, #CabinetExpansion, #BendaalamAshok

Apr 2, 2026 - 10:46
 0  15
అచ్చెన్నాయుడు స్థానం లో కొత్త మంత్రి..

శ్రీకాకుళం జిల్లాకు మరో మంత్రి పదవి వరించనుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గ విస్తరణకు ఊపారు. మంత్రివర్గ విస్తరణ పక్కా అన్న అంశం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతల్లో బాగా వినిపిస్తోంది. మంత్రులు పూర్తిగా లోకేష్ టీం మాత్రమే అని చెప్పటం అతిశయోక్తి కాదు. తీరు, వినయ విధేయతలు, సామాజిక అంశాలు, బలబలాలు వంటి చాలా అంశాలు బేరీజు వేసుకున్న తర్వాతే.. బలమైన నిర్ణయం తీసుకుంటున్నారు నారా లోకేష్. కొత్తవారికి అవకాశం ఇచ్చే క్రమంలో పాత వారిలో కొందరిని తప్పించాల్సి వస్తోందని, ఏం జరిగినా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే మంత్రి నారా లోకేష్ పార్టీలో సీనియర్లతో పాటు ముఖ్య నేతలకు కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మెజారిటీ మంత్రులకు ఉద్వాసన సంకేతాలూ లేకపోలేదు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బెందాళం అశోక్, పల్లా శ్రీనివాసరావు, మద్దిపాటి వెంకటరాజు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కొణతాల రామకృష్ణ మంత్రివర్గంలో చేరనున్నారు. ఇప్పటికే ఈ పేర్లకు  సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. శ్రీకాకుళం నుంచి కూన రవికుమార్ మంత్రివర్గ రేసులో ఉండేవారు. కానీ దూకుడుతో పాటు టీడీపీ అంతర్గత రాజకీయాల కారణంగా ఆయన చతికిలబడ్డారు. ఇక చివరిలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కూన రవికి అవకాశం లేనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సిక్కోలు జిల్లాలో ప్రస్తుతం ఉన్న అచ్చెన్నాయుడును మంత్రి పదవి నుంచి తప్పించి.. ాయన స్థానంలో బెందాళం అశోక్‌కు పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. 

వాస్తవానికి బెందాళం అశోక్.. వినయం, విధేయత, నిజాయితీ ఆభరణాలుగా ఉన్న వ్యక్తి. 2014 ఎన్నికల్లో తొలిసారి ఇచ్ఛాపురం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన అశోక్.. తొలి ఎన్నికలోనే 15 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. టీడీపీ సీనియర్ నేత బెందాళం ప్రకాష్ కుమారుడు కావడంతో పాటు వైద్యుడు కూడా కావడం అశోక్‌కు ఓ వరంలా మారింది. తండ్రి జీవితాంతం తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉండటం కూడా అశోక్‌కు బాగా కలిసి వచ్చింది. కిందిస్థాయి కార్యకర్తగా మొదలైన ప్రకాష్ రాజకీయ ప్రయాణం.. సిక్కోలు జిల్లాలో.. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. ఇదే అశోక్‌ గెలుపునకు అన్ని విధాలుగా ఉపకరించింది. పార్టీ అధికారంలో ఉన్న 2014-19 మధ్య కాలంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరగా ఉన్నారు అశోక్. ఇక సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించారు. అందుకే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా కూడా.. ఇచ్ఛాపురంలో మాత్రం అశోక్ గెలుపు నల్లేరు మీద నడకలా మారింది.

వైసీపీ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా.. ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా అశోక్ మాత్రం వెనుకడుగు వేయలేదు. టీడీపీ తరఫున పోరాటం చేశారు. అటు అసెంబ్లీలో, ఇటు సిక్కోలు జిల్లాలో, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కూడా నాటి వైసీపీ సర్కార్‌పై పోరాటం చేశారు. నాటి జగన్ సర్కార్ తీరును ప్రజల్లో ఎండగట్టారు. ఇదే సమయంలో నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా పని చేశారు. అలాగే పార్టీ సమావేశం నిర్వహణలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తనతో ఉండే వారు ఎవరేం చేస్తున్నారనే విషయాన్నీ తెలుసుకుంటూనే.. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. వారిని జాగ్రత్తగా దూరం పెట్టేశారు కూడా. ఆశ్రితపక్షపాతం, కుటుంబ పాలనను దరిచేరనియలేదు. నియోజకవర్గంలో అశోక్‌ను కుల, మత, పార్టీలకు అతీతంగా అభిమానిస్తారు. ఇక ఏ కార్యకర్తకు ఏ సమయంలో ఆపద వచ్చినా అండగా నిలుస్తారు. తోచిన సాయం చేస్తారనే పేరు. ఈ లక్షణాలే ఆయనను బలమైన నాయకుడిగా తీర్చిదిద్దాయి. దీంతో 2024 ఎన్నికలకు ముందే బెందాళం అశోక్ గెలుపు ఖాయమైంది. ఇంకా చెప్పాలంటే.. అశోక్ గెలుపు కంటే కూడా.. మెజారిటీ పైనే ఎక్కువగా చర్చ జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి, జడ్పీ చైర్మన్ భర్త పిరియా సాయిరాజ్‌పై ఏకంగా 40 వేల ఓట్ల మెజారిటీతో అశోక్ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో ఇదే అత్యధికం.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. ఈ ఏడాది జూన్ నాటికి సరిగ్గా రెండేళ్లు పూర్తి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. నిజానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే మంత్రివర్గంలో కొత్త వారు అంటూ సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో పాటు జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి ఖాయమంటూ చంద్రబాబు 2024 డిసెంబర్‌ నెలలోనే ప్రకటించారు. కానీ ఏడాది దాటినప్పటికీ ఇప్పటికీ వారిద్దరికీ అమాత్య యోగం లభించలేదు. వీరితో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో మంత్రివర్గ విస్తరణపై జోరుగా చర్చ నడుస్తోంది. పొలిటికల్ సర్కిల్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. భారీ ప్రక్షాళన దిశగా కూటమి సర్కార్ కసరత్తు.. అంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో భారీ మార్పులు అంటూ కామెంట్ చేస్తున్నారు. మెజారిటీ మంత్రులకు ఉద్వాసన తప్పదని హింట్ ఇచ్చారు. కొత్త మంత్రివర్గంలో ఖచ్చితంగా అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు.. అంటూ ఐదుగురి పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. వీరిలో పల్లా శ్రీనివాసరావు, బెందాళం అశోక్, మద్దిపాటి వెంకటరాజు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కొణతాల రామకృష్ణకు బెర్త్ ఖాయమన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. కొంచెం అటూ ఇటూ మార్పులతో లోకేష్ టీమ్‍తోనే కొత్త కేబినెట్ మార్పు ఉంటుందని.. భారీ మార్పులతో కొత్త మంత్రివర్గం ఉంటుందని వ్యాఖ్యానించారు.

ప్రధానంగా ఉత్తరాంధ్రకు చెందిన నలుగురు సీనియర్ నేతలకు మంత్రి పదవి ఖాయమంటున్నారు పార్టీ పెద్దలు. పల్లా, బెందాళం, కొణతాలతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా మంత్రి పదవుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి.. ఆ స్థానంలో బెందాళం అశోక్‌కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అచ్చెన్నాయుడుపై ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. స్థానిక నేతలతో సఖ్యత లేకపోవడంతో.. జిల్లాలో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే ఒకే కుటుంబంలో రెండు పదవులు అనే విషయం కూడా విమర్శలకు కారణం. దీంతో అచ్చెన్నాయుడుని తప్పించడం ఖాయమంటున్నారు. వాస్తవానికి కూన రవికుమార్‌ మంత్రి పదవి రేసులో ఉన్నారు. కానీ ఆయన దూకుడు వ్యవహారమే ఆయనకు పదవి రాకుండా చేసిందనే చర్చ నడుస్తోంది.