బాలల హక్కుల కమిషన్ కొత్త బృందం బాధ్యతలు స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా వేటుకూరి ఏవిఎస్ సూర్యనారాయణ రాజు, సభ్యులుగా కే.జీ వెంకట పద్మలత, డా. ధోని శ్రీనివాస్ మూర్తి, ఉండవల్లి గాంధీ బాబు, చల్ల మధుసూదన రావు, మండల గంగ సూర్యనారాయణ, పి. నాగ మానస సోమవారం రాష్ట్ర కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కమిషన్ సెక్రటరీ ఉమాదేవి సమక్షంలో నూతన చైర్‌పర్సన్, సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సెక్రటరీతో పాటు సిబ్బంది నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, వారి భవిష్యత్తు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలను సమర్థంగా అమలు చేయడంతో పాటు, పిల్లలపై జరిగే అన్యాయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సభ్యులు మాట్లాడుతూ పరస్పర సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో కలిసి పనిచేసి పిల్లలకు అనుకూల వాతావరణం కల్పిస్తామని వెల్లడించారు. ప్రతి బాలుడు భద్రత, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక హక్కులు పొందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. బాలలపై హక్కుల ఉల్లంఘనలు జరిగితే తక్షణమే కమిషన్ దృష్టికి తీసుకురావాలని ప్రజలను చైర్‌పర్సన్, సభ్యులు కోరారు. సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కమిషన్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. నూతన బృందం బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్రంలో బాలల సంక్షేమ కార్యక్రమాలకు మరింత వేగం దక్కనుంది.