భక్తుల సౌకర్యాలపై రాజీ లేదు – దేవాదాయ శాఖ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని దేవాదాయ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు. మంగళవారం గొల్లపూడిలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆర్‌జేసీ, డీసీ కేడర్‌కు చెందిన 22 ప్రధాన దేవాలయాల ఎగ్జిక్యూటివ్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులకు మరింత వేగవంతమైన, సులభమైన సేవలు అందించేందుకు ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలను విస్తృతంగా పెంపొందించాలని సూచించారు. కాలానుగుణంగా నూతన ఆర్జిత సేవలను ప్రవేశపెట్టి భక్తులకు మెరుగైన అనుభవాన్ని కల్పించాలన్నారు.
దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ మాట్లాడుతూ, దేవాలయాలు సమాజానికి భారం కాకుండా సమాజానికి సేవ చేసే విధంగా ఉండాలన్నారు. ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆలయాల్లో ‘జీరో వేస్ట్ డిస్పోజల్ పాలసీ’ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. చెత్తను డంపింగ్ యార్డులకు పంపకుండా ఆలయ స్థాయిలోనే శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహణ చేయాలని సూచించారు. ప్రజారోగ్యం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక ఆలయంలో విజయవంతంగా అమలైన ఉత్తమ విధానాలను (‘సక్సెస్ మంత్ర’) రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అమలు చేయాలని కమిషనర్ తెలిపారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా అన్ని ఆలయాల్లో రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. స్యూయజ్, సల్లేజ్ వాటర్ శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి నీటిని పునర్వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. వ్యర్థాల నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే బయోగ్యాస్, గోబర్ గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, నెలరోజుల్లోగా పైప్డ్ గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును పూర్తి చేయాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
ఆలయాల్లో సేవలందించే సేవకులను ప్రచారకర్తలుగా వినియోగిస్తూ ఆన్‌లైన్ సేవలు, సోషల్ మీడియా ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తరించాలని కమిషనర్ పేర్కొన్నారు. భక్తుల సేవే పరమావధిగా, పర్యావరణ హిత హరిత ఆలయాలుగా రాష్ట్ర దేవాలయాలను తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు, 22 ప్రధాన ఆలయాల ఈవోలు పాల్గొన్నారు. విజయవాడ, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు వివరించారు.