చిట్ ఫండ్ రంగ సమస్యలు పరిష్కరించాలి: అసోసియేషన్
#AP Chit Fund Associations #Chit Fund Industry #Vijayawada #Chandrababu Naidu #GST Issues
గత ఐదారేళ్లుగా చిట్ ఫండ్ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని ఏపీ చిట్ ఫండ్ అసోసియేషన్స్ అధ్యక్షులు ఎం.వి. చౌదరి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిఅనగాని సత్యప్రసాద్‌లను కలిసి వినతిపత్రం సమర్పించామని గుర్తు చేశారు. జీఎస్టీ సమస్యలతో పాటు ఇతర సాంకేతిక ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
: విజయవాడలోని హోటల్ మురళీ ఫార్చూన్ వేదికగాఫెడరేషన్ ఆఫ్ ఏపీ చిట్ ఫండ్ అసోసియేషన్స్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఫెడరేషన్ అధ్యక్షులు ఎం.వి. చౌదరి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి ఆల్ ఇండియా చిట్ ఫండ్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డే వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కమల్ బాంబని (ఢిల్లీ), మాజీ కార్యదర్శి చిత్తరసు చైర్మన్ పి. రాజాజీ, మార్గదర్శి సీఈఓ పాతూరి సత్యనారాయణ సహా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, గత ఐదారేళ్లుగా చిట్ ఫండ్ రంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను వివరించారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో జరగాల్సిన ఆర్బిట్రేషన్ ప్రక్రియ సరిగ్గా అమలు కాకపోవడం, చిట్ వేలం టర్నోవర్ పర్మిషన్ల కోసం గతంలోలా జిల్లా అధికారుల వద్ద కాకుండా విజయవాడలోని ఐజీ కార్యాలయానికి రావాల్సి రావడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యవస్థ బలహీనపడిందని పేర్కొన్నారు.తమ సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిఅనగాని సత్యప్రసాద్‌లను కలిసి వినతిపత్రం సమర్పించామని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. జీఎస్టీ సమస్యలతో పాటు ఇతర సాంకేతిక ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని వెల్లడించారు. మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసానిచ్చే ఈ వెయ్యేళ్ల నాటి సంప్రదాయ వ్యాపారాన్ని కాపాడుకోవడం ద్వారా అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరుతుందని, త్వరలోనే చిట్ ఫండ్ రంగానికి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.