ఆవ భూముల మాయాజాలం.. పేదల పేరుతో కోట్ల దోపిడి!
#aavalands #poorhousingscam
ఇసుక నుంచి ఆయిల్ తీయడం కాదు.. బురద నుంచి బూస్ట్ తీస్తారు మనోళ్లు.. మరి హైలీ ట్యాలెంటెడ్ కదా. ఏం చేసి ఎలా చేసి డబ్బులు బయటకు తీయడం అనేది వాళ్లకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. పేరు పబ్లిక్‌ది.. సొమ్ము ప్రభుత్వానిది.. చివరకు అది చేరేది రాజకీయ నేతల జేబుల్లోకి. ఈ ఫార్ములాను బ్రేక్ చేయడం ఎవరి వల్లా కావటం లేదు. రాజానగరం నియోజకవర్గంలోని ఆవ భూముల వ్యవహారం అలాగే ఉంది. రికరింగ్ డిపాజిట్ లాగా ఆ భూముల నుంచి పదే పదే ఆదాయం సంపాదిస్తున్నారు రాజకీయ నేతలు.
రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండల పరిధిలో గల 'ఆవ భూముల' వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. పేదల ఇళ్ల పట్టాల పేరుతో జరిగిన ఈ భూసేకరణలో గత ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉండగా, ప్రస్తుతం ఆ భూములు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుండటం గమనార్హం.
పేదలకు 'నీటి' పట్టాలు.. నేతలకు 'నోట్ల' మూటలు.....రాజమండ్రి సమీపంలోని కోరుకొండ మండల ఆవ భూములు అంటేనే వివాదాలకు నిలయంగా మారాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇక్కడ వందలాది ఎకరాలను సేకరించారు. అయితే, ఆ భూసేకరణ వెనుక ఉన్న అసలు రంగు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతోంది.
వాస్తవానికి ఈ ఆవ భూములు లోతట్టు ప్రాంతంలో ఉంటాయి. ఏడాదిలో సుమారు ఆరు నెలల పాటు గోదావరి వరద నీటితోనో లేదా వర్షపు నీటితోనో ఇవి చెరువుల్లా దర్శనమిస్తాయి. అందుకే అక్కడ ఎకరం భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం గరిష్టంగా రూ.7 లక్షలు మాత్రమే ఉండేది. కానీ, అప్పటి అధికార పార్టీ నేతలు అధికారులతో కుమ్మక్కై, ప్రభుత్వ కొనుగోలు ధర: ఎకరాకు సుమారు రూ. 45 లక్షలు. రైతుకు అందింది: కేవలం రూ.20 లక్షలు.నేతల వాటా: మిగిలిన రూ. 25 లక్షలు స్థానిక ప్రజాప్రతినిధులు, మధ్యవర్తులు, అధికారుల జేబుల్లోకి వెళ్లాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.నివాస యోగ్యం కాని 'జల' నివాసాలు మాదిరి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పట్టాలు పంపిణీ చేసినా, ఒక్క లబ్ధిదారుడు కూడా అక్కడ ఇల్లు నిర్మించుకోలేదు. ఎందుకంటే, అక్కడ అడుగుపెడితే మోకాలోతు నీరు, బురద తప్ప ఏమీ ఉండదు. నివాసానికి ఏమాత్రం పనికిరాని ఆ భూములను పేదల నెత్తిన రుద్దడంతో, ఆ పట్టాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి.
ఇప్పుడు కొత్తగా సాగు దందా మొదలైంది అవే భూముల్లో. ప్రభుత్వం సేకరించిన భూమి కాబట్టి అక్కడ ఎవరూ ఉండటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు స్థానిక రాజకీయ నాయకులు, ముఖ్యంగా కోరుకొండకు చెందిన కొందరు రాజకీయ బినామీలు ఆ భూములను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇప్పుడు మొక్కజొన్న, వరి, చెరుకు పంటలు పండుతున్నాయి. ప్రభుత్వం సేకరించిన వందలాది ఎకరాల్లో అక్రమంగా సాగు చేస్తూ, ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులు గడిస్తున్నారు.
పేదల సొంతింటి కల సాకారం కావాలనే లక్ష్యంతో సేకరించిన భూములు, నేడు అక్రమార్కుల సాగుకు నిలయాలుగా మారడం విషాదకరం. అటు కొనుగోలులో భారీ అవినీతి, ఇటు సాగులో అక్రమ సంపాదన.. ఇలా రెండు వైపులా ప్రభుత్వ ఆస్తులు దోపిడీకి గురవుతున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఆవ భూముల వెనుక ఉన్న అసలు నిందితులను శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.