ఇకనుంచి విశాఖపట్నం ఏఐ డేటా హబ్

#vizag #AIDataHub #Andhrapradesh #Naralokesh #Narachandrababunaidu

Apr 29, 2026 - 10:36
 0  4
ఇకనుంచి విశాఖపట్నం ఏఐ డేటా హబ్

విశాఖపట్నం నగర చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇంతకాలం స్టీల్ సిటీగా, బీచ్ సిటీగా పేరుగాంచిన వైజాగ్ ఇకపై గ్లోబల్ ఐటీ హబ్‌గా, ముఖ్యంగా ఏఐ డేటా హబ్‌గా ఎదగబోతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. విశాఖ సమీపంలోని తర్లువాడ వద్ద గూగుల్ ప్రతిష్టాత్మక డేటా సెంటర్‌కు భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మంత్రి లోకేష్ తన ప్రసంగంలో ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను ప్రత్యేకంగా వివరించారు. “ఇది సాధారణ భూమిపూజ కాదు... భవిష్యత్తుకి పునాది. ఒక ప్రాజెక్ట్ కాదు... ఒక జనరేషన్‌ని మార్చే ఉద్యమం” అని ఆయన పేర్కొన్నారు. “ఇప్పటి వరకు విశాఖ స్టీల్ సిటీ... ఇకపై ఏఐ డేటా హబ్” అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. 2026 ఏప్రిల్ 28 తేదీని చరిత్రలో నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.

గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌తో విశాఖపట్నం ప్రపంచ ఐటీ మ్యాప్‌లో స్థానం సంపాదించబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగర ముఖచిత్రం పూర్తిగా మారుతుందని, “వైజాగ్‌లో ‘జి’ అంటే గూగుల్” అని చెప్పే స్థాయికి తీసుకెళ్తామని అన్నారు.

భారీ పెట్టుబడి – లక్షల ఉద్యోగాలు

ఈ ప్రాజెక్ట్‌లో గూగుల్ సంస్థ సుమారు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇది సాధారణ డేటా సెంటర్ కాకుండా 1 గిగావాట్ సామర్థ్యంతో కూడిన ఏఐ మెగా హబ్‌గా రూపుదిద్దుకోనుంది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ విస్తరించనుంది. 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

నిర్మాణ దశలోనే సుమారు 25 వేల మందికి ఉపాధి లభించనుండగా, ప్రాజెక్ట్ పూర్తయ్యాక ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 2 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని మంత్రి వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రికల్, మెకానికల్ రంగాల్లో అధిక నైపుణ్య ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

13 నెలల కృషి ఫలితం

గూగుల్ ప్రాజెక్ట్ సాధన వెనుక ప్రభుత్వం చేసిన కృషిని లోకేష్ వివరించారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో నెల నుంచే గూగుల్ ప్రతినిధులతో చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. సెప్టెంబర్ 2024లో ప్రారంభమైన ఈ ప్రయాణం, 13 నెలల కృషి తర్వాత అక్టోబర్ 2025లో ఢిల్లీలో అధికారిక ప్రకటనకు దారి తీసిందన్నారు.

ఈ ప్రాజెక్ట్ సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా పర్యవేక్షణ చేశారని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారం కీలకమని చెప్పారు. అవసరమైన పాలసీ మార్పులను వేగంగా అమలు చేయడం వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని పేర్కొన్నారు.

సీబీఎన్ బ్రాండ్ – పెట్టుబడుల ఆకర్షణ

పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌కి రావడానికి కారణమైన అంశాలను లోకేష్ వివరించారు. “బ్రాండ్ సీబీఎన్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్” అనే మూడు ప్రధాన అంశాలు రాష్ట్రానికి పెట్టుబడులను తెచ్చాయని చెప్పారు. సైబరాబాద్ నిర్మాణం ద్వారా ఏర్పడిన విశ్వసనీయత ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు.

దేశానికి వచ్చే ప్రతి రూ.100 పెట్టుబడిలో రూ.25 ఆంధ్రప్రదేశ్‌కి రావడం రాష్ట్ర ప్రతిభకు నిదర్శనమని ఆయన అన్నారు.

విశాఖ – ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం

గూగుల్ ప్రాజెక్ట్‌తో విశాఖ ప్రాంతం ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జరిగిన భేటీని ప్రస్తావిస్తూ, రాష్ట్ర ఎగ్జిక్యూషన్ స్పీడ్, పాలసీ క్లారిటీపై ఆయన ప్రశంసలు వ్యక్తం చేశారని లోకేష్ తెలిపారు.

వికేంద్రీకరణతో అభివృద్ధి

ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను వేర్వేరు ఎకనామిక్ జోన్లుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, డేటా సెంటర్లు; కోస్తాలో ఆక్వా, సీబీజీ; రాయలసీమలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.

రాజకీయ వ్యాఖ్యలు – ప్రతిపక్షాలపై విమర్శలు

తన ప్రసంగంలో మంత్రి లోకేష్ ప్రతిపక్షాలపై కూడా విమర్శలు గుప్పించారు. గతంలో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, పెట్టుబడులు రాలేదని ఆరోపించారు. “మాది గూగుల్... వారిది గొడ్డలి” అంటూ విమర్శిస్తూ, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరిగినట్లు పేర్కొన్నారు.