అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతికి శాశ్వత ప్రేరణ
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘన నివాళులు అర్పించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన పొట్టి శ్రీరాములు త్యాగం భారత చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష, అచంచల సంకల్పం తెలుగు జాతి చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిందని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే లక్ష్యంతో పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని తెలిపారు. 1952లో ఆయన ప్రారంభించిన నిరాహార దీక్ష 58 రోజుల పాటు కొనసాగి చివరకు ఆయన ప్రాణత్యాగంతో ముగిసిందని గుర్తు చేశారు.
పొట్టి శ్రీరాములు త్యాగం దేశాన్ని కదిలించి కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించాల్సిన పరిస్థితి తీసుకువచ్చిందని మంత్రి చెప్పారు. ఆ త్యాగం ఫలితంగానే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు. భాషా ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు కూడా ఆయన త్యాగమే ప్రధాన కారణమని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ విగ్రహం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు జాతి చరిత్రలో పొట్టి శ్రీరాములు స్థానం అపూర్వమని, ఆయన త్యాగం వల్లే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధ్యమైందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. యువత పొట్టి శ్రీరాములు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వారి త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.