మన నేల మీద "బుల్లెట్" గర్జన
#RoyalEnfield #AndhraPradesh #APIndustries #Satyavedu #Tirupati #BulletBike #AutomobileIndustry #IndustrialDevelopment #MakeInIndia #APGovernment #NaraLokesh #Investment
దశాబ్దాల కాలంగా ఆటోమొబైల్ రంగానికి చిరునామాగా మారిన తమిళనాడుకు ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది. బుల్లెట్ అంటేనే చెన్నై, చెన్నై అంటేనే రాయల్ ఎన్‌ఫీల్డ్ అనే ముద్రను చెరిపేస్తూ, ఆ దిగ్గజ సంస్థ 1955 నాటి తన భారత ఉత్పత్తి ప్రారంభం తర్వాత తొలిసారిగా తమిళనాడు దాటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని వనెల్లూరు – రాళ్ళకుప్పం గ్రామాల కేంద్రంగా రెండు దశల్లో 2 వేల 200 కోట్ల పెట్టుబడితో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం ఏపీ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేసే పరిణామం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన చరిత్రలోనే తొలిసారి బయటి రాష్ట్రానికి వెళ్లడం తమిళనాడులో పెను దుమారాన్నే రేపుతోంది. "మా రాష్ట్ర బ్రాండ్ చేజారిపోతోందా?" అని అక్కడి సోషల్ మీడియాలో, మీడియాల్లో ఇదొక "ఇండస్ట్రియల్ వార్"గా మారుతోంది. ఒరగాడం – హోసూర్ బెల్ట్‌కు వెళ్లాల్సిన పెట్టుబడి సత్యవేడు – శ్రీ సిటీ కారిడార్‌కు మళ్లుతోందని తమిళనాడు పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. చెన్నైకి అత్యంత సమీపంలో కేవలం 50 కిలోమీటర్ల దూరంలో సత్యవేడును ఎంచుకోవడం ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ చతురమైన వ్యూహం పన్నింది. అటు చెన్నైలోని పాత సప్లై చైన్, ఓడరేవులను వాడుకుంటూనే, ఇటు ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న భూ కేటాయింపులు, పన్ను రాయితీలు, వేగవంతమైన అనుమతులను అందిపుచ్చుకుంటోంది. దీన్ని "జియోగ్రాఫికల్ ఆర్బిట్రేజ్" అని వ్యాపార వర్గాలు పిలుస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్"కు నిదర్శనం.
పెట్టుబడి ఒక్కటే కాదు.. ఒక 'ఎకోసిస్టమ్' వస్తోంది. ఈ ప్రాజెక్టు సంఖ్యలు చూస్తే పరిమాణం అర్థమవుతుంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యంలో 9 లక్షల యూనిట్ల అదనపు వృద్ధి, అలాగే 5 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కూడా రానున్నాయి. అయితే, వీటి కంటే అసలైన గేమ్ చేంజర్ ఏమిటంటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇక్కడ నిర్మించనున్న సమగ్ర వెండర్ పార్క్. ఒక బైక్ తయారీకి కావాల్సిన వందలాది స్పేర్ పార్ట్స్ తయారీ యూనిట్లు కూడా ఏపీకి తరలివస్తాయి. తమిళనాడులో పాతుకుపోయిన ఆంసిల్లరీ పరిశ్రమ క్రమంగా విభజనకు లేదా తరలింపునకు గురవుతుందని తమిళనాడు పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందడం అతిశయోక్తి కాదు. ఒక సంస్థ వస్తే మరికొన్ని వస్తాయి.. ఇది పరిశ్రమ ఆర్థిక శాస్త్రం. దక్షిణ ఆంధ్రప్రదేశ్ త్వరలోనే మరో స్వతంత్ర 'ఆటోమొబైల్ హబ్'గా అవతరించబోతోంది. ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో సాగుతున్న ఈ పారిశ్రామిక వేట, భోగాపురం నుంచి మచిలీపట్నం వరకు సాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన ఇప్పుడు ఫలితాలను ఇస్తోంది.
గతంలో కియా మోటార్స్ అనంతపురాన్ని ప్రపంచ పటంలో నిలబెడితే, ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ గర్జన సత్యవేడు సరిహద్దుల్లో వినిపించబోతోంది. ఇది కేవలం ఒక పరిశ్రమ రాక మాత్రమే కాదు..గత ఐదేళ్లలో ఏపీ "పెట్టుబడులు రాని రాష్ట్రం" అనే పాత ముద్రను తుడిచిపెట్టేస్తోంది. పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ఇప్పుడు నిజమైన పరీక్ష.