బీఆర్ నాయుడికి బైబై.... కొత్తగా ఉత్తరాంధ్ర కాపు నేత

#TTD, #BRNaidu, #TDP #Pawankalyan, #Chandrababu, #JSP, #Kimidikalavenkatrao

Apr 7, 2026 - 10:31
 0  9
బీఆర్ నాయుడికి బైబై.... కొత్తగా ఉత్తరాంధ్ర కాపు నేత

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు మార్పు ఖాయమైందా..? ఇప్పుడు ఇదే చర్చ ఇటు తెలుగుదేశం పార్టీలో, అటు టీటీడీలో కూడా జోరుగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా 2024 నవంబర్ 5న టీవీ 5 న్యూస్ ఛానల్ అధినేత బొల్లినేని రాజగోపాల్ నాయుడు బాధ్యతలు చేపట్టారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా విస్తృత ప్రచారం చేశారనే కారణంతోనే బీఆర్‌ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ పదవి సరిగ్గా రెండేళ్ల పాటు ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా ఏడాదిన్నరకే నాయుడుపై వేటు ఖాయమనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది.

టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి నుంచి ఆగ్రహంతో ఉన్నారనే మాట బాగా వినిపిస్తోంది. బీఆర్ నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వచ్చిన వైకుంఠ ఏకాదశి పండుగ జరిగింది. ఆ టికెట్ల కేటాయింపు సమయంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. అప్పుడు 8 మంది భక్తులు మృతి చెందారు. సుమారు 20 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అందుకు బోర్డు సభ్యుల నిర్లక్ష్యమే కారణమని అప్పట్లో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో టీటీడీని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు కూడా. అయితే వీటికి బీఆర్ నాయుడు సమర్థవంతంగా తిప్పికొట్టలేక పోయారు.

చివరికి బీఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నారంటూ కొన్ని వీడియోలను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. అటు బీఆర్ నాయుడు సైతం ఈ వీడియోలపై డబుల్ స్టేట్ మెంట్ ఇవ్వడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ముందు అవి ఏఐ వీడియోలన్నారు. తనను ఇబ్బంది పెట్టేందుకు ఏఐ ద్వారా వీడియోలు రిలీజ్ చేశారని.. అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ మహిళ కుటుంబంతో తమ కుటుంబానికి 30 ఏళ్లుగా సంబంధం ఉందని.. ఆ వీడియోలో తప్పేం జరగలేదంటూ సర్థిచెప్పుకునే వ్యాఖ్యలు చేశారు. ఇవే పెద్ద దుమారం రేపాయి.

బీఆర్ నాయుడు తీరుపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారనేది టీడీపీ నేతల మాట. అందుకే ఇటీవల ఆయన తిరుమల పర్యటనలో కూడా బీఆర్ నాయుడును కాస్త దూరం పెట్టారనే ప్రచారం జరిగింది. తిరుమలలో సీఎం నిర్వహించిన రివ్యూ మీటింగ్‌కు కూడా నాయుడు దూరంగా ఉన్నారు. దీంతో నాయుడుపై వేటు ఖాయమని అప్పుడే క్లారిటీ వచ్చింది. ఇక ఏప్రిల్ ఒకటిన ఒంటమిట్టలో జరిగిన శ్రీ కోదండ రామస్వామి కల్యాణోత్సవానికి హాజరైన చంద్రబాబు.. అక్కడ కూడా బీఆర్ నాయుడుతో అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. ఇప్పుడు బీఆర్ నాయుడు బదిలీ అనే ప్రచారం టీడీపీ నేతల్లో బాగా వినిపిస్తోంది. ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేతకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ నాయుడు స్థానంలో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును టీటీడీ చైర్మన్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేతగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా, రాజ్యసభ సభ్యునిగా మంత్రిగా కూడా కళా వెంకట్రావు పని చేశారు. అలాగే గతంలో టీటీడీ చైర్మన్‌గా కూడా పని చేసిన అనుభవం ఉంది. బీసీ నేతగా, ఉత్తరాంధ్ర నేతగా, వివాద రహితునిగా కళా వెంకట్రావుకు పేరు. ఆయనకు మంత్రివర్గంలో తప్పనిసరిగా చోటివ్వాల్సి ఉంది. అయితే యువతకు అవకాశం ఇవ్వాలనే కారణంతో ఆయనను పక్కన పెట్టారు. దీంతో ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే బెటర్ అనేది చంద్రబాబు ఆలోచన. అన్ని పార్టీల నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. కాబట్టి.. ఆయనే సరైన వ్యక్తిగా చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ, కాపు నేతగా కళా వెంకట్రావుకు అవకాశం ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.